సంచలనంగా రాయిటర్స్ కథనం.. అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు .. ఎక్కడంటే?
తన తాజా కథనంతో సంచలనానికి కేంద్రంగా నిలిచారు. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర యుద్ధం తెలిసిందే.;
ప్రపంచం ఏమైనా పోనీ.. తమ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే విషయంలో అగ్రరాజ్యం అమెరికా తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే కాలు దువ్వగలదు.. కాదనుకుంటే అంతే వేగంగా వెనక్కి తగ్గగలదు. ఈ రెండింటి విషయంలోనూ తనను తాను సమర్థించుకునేలా వాదనల్ని వినిపించగలదు. తాజాగా అలాంటి సీన్ ఎదురు కానుందా? అంటే అవునని చెబుతోంది ప్రఖ్యాత మీడియా సంస్థ రాయిటర్స్.
తన తాజా కథనంతో సంచలనానికి కేంద్రంగా నిలిచారు. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర యుద్ధం తెలిసిందే. అంతకంతకూ ముదిరిపోతూ.. ఈ యుద్ధం విపరిణామాలు చివరకు ఎక్కడివరకు వెళతాయన్నది అర్థం కాని పరిస్థితుల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ మీద జరుపుతున్న దాడులకు ఐదు రోజుల విరామాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అంతే వేగంగా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. మొన్నటివరకు ఇరాన్ అంతమే తన పంతం అన్నట్లు వ్యవహరించిన ఆయన.. తాజాగా ఆ దేశంతో చర్చలకు సిద్ధమన్న సంకేతాల్ని ఇచ్చేశారు.
ఇందుకు వేదికగా పాకిస్థాన్ ను ఎంపిక చేసినట్లుగా రాయిటర్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ - అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు సంక్షోభం తీవ్రరూపం దాల్చటం తెలిసిందే. సప్లై చైన్ తెగి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ మీద ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న వేళలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము.. ఇరాన్ తో చర్చలకు సిద్ధమని.. అందుకు ప్రతిగా ఐదు రోజులు దాడులకు విరామం ప్రకటించటం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇరాన్ - అమెరికా మధ్య చర్చలకు పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా మారుతుందని చెబుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చే విషయంలో తెర వెనుక పాకిస్థాన్.. టర్కీ.. ఈజిఫ్ట్ దేశాలు తీవ్రంగా ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా తరఫు ప్రతినిధులుగా ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఇరాన్ తరఫు ఆ దేశ కీలక అధికారులు పాల్గొంటారు. మధ్యవర్తులుగా ఇస్లాం దేశాలైన పాక్.. టర్కీ.. ఈజిప్టు పాల్గొంటాయి. రాయిటర్స్ కథనం ఇలా ఉంటే.. అమెరికాలో తాము చర్చలకు సిద్ధంగా లేమని ఇరాన్ స్పీకర్ ప్రకటించారు. దీంతో.. రాయిటర్స్ కథనం నిజం కానుందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై ఈ రోజు (మంగళవారం) ఫుల్ క్లారిటీ వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.