అమెరికాలో వృద్ధురాలిని మోసం చేసి ₹97 వేల డాలర్ల బంగారం దోచుకున్న తెలుగు వ్యక్తి అరెస్ట్
గత ఏడాది సెప్టెంబర్ 11, 2025న సాయి ప్రవీణ్ కొమ్మన స్వయంగా బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు.;
అమెరికాలో మరోసారి టెక్నాలజీ ఆధారిత ఆర్థిక మోసం కలకలం రేపింది. అమాయక వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ మాఫియా ఉచ్చులో చిక్కుకున్న ఓ వృద్ధురాలు ఏకంగా 97,240 డాలర్ల (సుమారు రూ. 80 లక్షలకు పైగా) విలువైన బంగారాన్ని పోగొట్టుకుంది. మిస్సౌరీ రాష్ట్రంలోని క్లే కౌంటీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి తెలుగు మూలాలు కలిగిన వ్యక్తి సాయి ప్రవీణ్ కొమ్మన అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంచలన కేసు వివరాలను క్లే కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
మోసం సాగిందిలా.. భయం పుట్టించి.. బంగారాన్ని కొల్లగొట్టి
నేరస్తులు బాధితురాలిని మానసికంగా దెబ్బతీసేలా వ్యూహరచన చేశారు. తొలుత ఒక వ్యక్తి బాధితురాలికి ఫోన్ చేసి తాను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్నాడు. ఆమె సోషల్ సెక్యూరిటీ ఖాతా హ్యాక్ అయ్యిందని.. ఆమె బ్యాంక్ నిల్వలు ప్రమాదంలో ఉన్నాయని నమ్మబలికాడు. బాధితురాలికి అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా ఒక నకిలీ సీఐఏ ఐడెంటిటీ కార్డు ఫోటోను కూడా పంపించాడు. ఆమె ఆస్తులను "సురక్షితం" చేయాలంటే.. వెంటనే నగదును బంగారంగా మార్చి తమకు అప్పగించాలని.. దర్యాప్తు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మించాడు. భయపడిపోయిన ఆ వృద్ధురాలు.. నిందితుడి ఫోన్ సూచనల ప్రకారం కాన్సాస్ సిటీలోని ఒక నగల దుకాణంలో భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసింది.
పక్కా ప్లాన్‌తో అరెస్ట్
గత ఏడాది సెప్టెంబర్ 11, 2025న సాయి ప్రవీణ్ కొమ్మన స్వయంగా బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఎక్సెల్సియర్ స్ప్రింగ్స్ పోలీసులను ఆశ్రయించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీఐ) సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు.. సాయి ప్రవీణ్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కఠిన శిక్షలు పడే అవకాశం
వృద్ధులపై ఆర్థిక దోపిడీని అమెరికా చట్టాలు అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ఈ కేసులో నేరం నిరూపితమైతే నిందితుడికి 10 నుండి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు నిందితుడికి 2,00,000 డాలర్ల భారీ బెయిల్‌ను విధించింది. తదుపరి విచారణ తేదీని కోర్టు త్వరలోనే ఖరారు చేయనుంది.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని భారతీయులు.. స్థానిక వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సీఐఏ, ఎఫ్.బీఐ లేదా ఐఆర్ఎస్ వంటి సంస్థలు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బులు లేదా బంగారం అడగవని గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఖాతాలు బ్లాక్ అయ్యాయని భయపెడితే వెంటనే ఫోన్ కట్ చేసి కుటుంబ సభ్యులకు లేదా బ్యాంకు అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయాలి. ఫోన్ కాల్స్ ఆధారంగా ఎవరినీ ఇంటికి రానివ్వకూడదు. ఈ కేసు విదేశాల్లో స్థిరపడిన వారిలో ముఖ్యంగా భారతీయ మూలాలున్న వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడటంపై ఆందోళన రేకెత్తిస్తోంది.