రియల్ ధురంధర్ క్లైమాక్స్ మాత్రం విషాదమే

రీల్ లైఫ్ మాదిరి రియల్ లైఫ్ ఉండదు. అది అసాధ్యం కూడా. అందుకు నిదర్శనంగా నిలుస్తారు రియల్ ధురంధర్ జీవితమే.;

Update: 2026-03-24 05:51 GMT

రీల్ లైఫ్ మాదిరి రియల్ లైఫ్ ఉండదు. అది అసాధ్యం కూడా. అందుకు నిదర్శనంగా నిలుస్తారు రియల్ ధురంధర్ జీవితమే. అలా అని రీల్ ధురంధర్ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసింది కాకున్నా.. ఇతగాడి జీవితం గురించి తెలిసినంతనే.. రీల్ ధురంధర్ లీలగా మనసులో మెదలక మానదు. పాక్ లో అండర్ కవర్ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసి.. అనూహ్య రీతిలో పట్టుబడి.. చివరకు అత్యంత విషాదభరితంగా సాగిన రియల్ ధురంధర్ జీవితం గురించి తెలిసినప్పుడు మనసు బరువెక్కుతుంది. కళ్లను కన్నీళ్లు కమ్మేసే పరిస్థితి. ఇంతకూ అతను ఎవరో కాదు రవీంద్ర కౌశిక్. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో బ్లాక్ టైగర్ గా గుర్తింపు పొందిన ఇతగాడి జీవితం అత్యంత స్ఫూర్తిదాయమే కాదు.. దేశం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన వైనం చిరస్మరణీయం.

రీల్ ధురంధర్ క్లైమాక్స్ ఒకలాంటి పాజిటివ్ ఎండ్ కార్డు పడితే.. రియల్ ధురంధర్ తరహాలోని అండర్ కవర్ ఏజెంట్ రవీంద్ర కౌశిక్ జీవితం మాత్రం విషాదమైంది. ఇతడి జీవితం గురించి విశ్రాంత మేజర్ జనరల్.. రా మాజీ అధికారి వీకే సింగ్ రాసిన ఇండియా ఎక్స్ టర్నర్నల్ ఇంటెలిజెన్స్: సీక్రెట్స్ ఆఫ్ రా పుస్తకంలో ప్రస్తావించారు. ఇంతకూ అతడి జీవితం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

రాజస్థాన్ లోని శ్రీగంగానగర్లో 1952 ఏప్రిల్ 11న పుట్టిన అతనికి మొదట్నించి పంజాబీ భాషపైన మాత్రమే కాదు స్థానిక యాసల మీదా పట్టు ఉండేది. నాటకాలు వేయటం అతనికి మహా సరదా. 1973లో లక్నోలో జరిగిన జాతీయ స్థాయి డ్రామా పోటీల్లో సైనికుడిగా ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. భాషపై పట్టు.. అతడి టాలెంట్.. అతని స్థైర్యం గురించి సమాచారం అందుకున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అతడ్ని కాంటాక్టు చేసింది. దేశం కోసం తనను తాను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతనికి ఢిల్లీలో రెండేళ్లు ట్రైనింగ్ ఇచ్చి.. ఒక పాక్ జాతీయుడు ఎలా ఉంటాడన్న దానికి నిదర్శనంగా పక్కాగా అలా మారిపోయాడు.

నబీ అహ్మద్ షకీర్ పేరుతో 1975లో సరిహద్దులు దాటిన తను.. పాక్ లోకి విజయవంతంగా ఎంట్రీ ఇవ్వటమే కాదు.. తన ప్లాన్ లో భాగంగా కరాచీ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీకి అప్లికేషన్ చేసుకున్నాడు. చివరకు పాక్ ఆర్మీలోకి అడుగు పెట్టటమేకాదు.. సైన్యంలో మేజర్ స్థాయికి చేరుకున్నాడు. 1979 నుంచి 1983 మధ్యలో బోలెడంత సమాచారాన్ని ఢిల్లీకి చేరవేశాడు. రవీంద్ర కౌశిక్ ఇచ్చిన సమాచారం ఎన్నో ఉద్రిక్తలను నివారించటమే కాదు.. వేలాది మంది అమాయక ప్రాణాలను కూడా రక్షించాడని చెబుతారు.

భారత్ కు విధేయుడిగా ఉంటూనే.. పాక్ లో అమానత్ అనే మహిళను పెళ్లి చేసుకొని.. ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. దేశానికి అతగాడు చేసిన సేవల గురించి తెలుసుకున్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అన్న అరుదైన గుర్తింపును ఇచ్చినట్లు చెబుతారు. అతడి సాహస ప్రయాణం విజయవంతంగా సాగుతున్న వేళలో అనూహ్య రీతిలో చోటు చేసుకున్న ఒక పొరపాటు అతడి లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసిన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.

1983లో రవీంద్రను సంప్రదించే ప్రయత్నం చేశాడు.. అతడి మాదిరి రాలో చేరిన మరో అండర్ కవర్ ఏజెంట్ జూనియర్ ఇనాయత్. అప్పటికే మన నిఘాపై పాక్ కౌంటర్ ఇంజెలిజెన్స్ అతడ్ని.. రవీంద్రను అదుపులోకి తీసుకుంది. పాక్ చెరలో ఎన్ని చిత్రహింసలుపెట్టినప్పటికీ రవీంద్ర మాత్రం నోరు విప్పింది లేదు. ఎంతగా హింసించినా.. మానసికంగా వేధించినా తన గుర్తింపు మాత్రం వెల్లడించలేదు. తాను పాక్ జాతీయుడినేనని నమ్మించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరకు అతడికి పాక్ మిలిటరీ కోర్టు (1985)మరణశిక్ష విధించింది. ఆ తర్వాత దాన్ని జీవితఖైదుగా మార్చింది. ఆ తర్వాత భారత్ లోని తన కుటుంబానికి కొన్ని లేఖలు రాసినట్లు చెబుతారు. అతడి విడుదల కోసం ప్రయత్నాలు జరగలేదన్న విమర్శ ఉంది. చివరకు 18 ఏళ్లు జైల్లో మగ్గి.. ఊపిరితిత్తులు.. గుండె సంబంధిత వ్యాధులతో 2001, నవంబరు 21న మియాన్ వాలీ జైలులో మరణించాడు. అతడి చివరి ఆనవాలు లభించకుండా జైలు వెనుకనే అతడ్ని ఖననం చేశారని చెబుతారు. తాజాగా రీల్ ధురంధర్ విడుదల నేపథ్యంలో రియల్ ధురంధర్ విషాద ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది.

Tags:    

Similar News