కాకి ఫ్యాంట్.. బ్లూ టీ షర్టు..రోటీన్ కు భిన్నంగా వేషమే కాదు మాటలు మారాయి

Update: 2021-01-25 08:10 GMT
రాజకీయ నేత అంటే ఎలా ఉండాలి? నలగని ఖద్దరు. వైట్ అండ్ వైట్.. లేదంటే ప్రధాని మోడీ మాదిరి.. భిన్న రీతిలో వస్త్రధారణతో ఉండాలని ఆశిస్తారు. అందుకు భిన్నంగా వ్యవహరించి ఆశ్చర్యానికి గురి చేశారు కాంగ్రెస్ కీలక నేత.. రేపో మాపో కాంగ్రెస్ అధ్యక్షకుర్చీలో కూర్చునే రాహుల్ గాంధీ. తాజాగా తమిళనాడులో పర్యటించిన ఆయన.. తన మాటలతోనే కాదు.. వేషధారణతోనూ ఆకట్టుకున్నారని చెప్పాలి.

కొంగుమండలంలో ఎన్నికల ప్రచారానికి మూడురోజుల పర్యటనలో వచ్చిన ఆయన ఊత్తుకుడికి వెళ్లారు. ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించిన రాహుల్.. ఈ సందర్భంగా ఆయన వస్త్రధారణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. జాతీయ నేతల తీరుకు భిన్నంగా ఖాకీ ఫ్యాంటు.. బ్లూ టీ షర్టు వేసుకున్న ఆయన.. తన పర్యటన ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు.

వణక్కం అంటూ తమిళంలో తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్న ఆయన.. తమిళులకు.. తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకోవటం గమనార్హం. తన నాయనమ్మ ఇందిర.. తన తండ్రి రాజీవ్ లకు తమిళ ప్రజలు ఇచ్చిన గౌరవ మర్యాదలు తెలుసన్నారు. తాను ప్రధాని మోడీ మాదిరి మన్ కీ బాత్ పేరుతో కథలు చెప్పేందుకు రాలేదన్నారు.

‘మీరు చెప్పేది వినటానికి.. మీ కష్ట నష్టాలుతెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చా. నేను మీలో ఒకడిని. మీ కుటుంబంలో పుట్టిన బిడ్డనని చెప్పుకోవటానికి గర్విస్తున్నా. నరేంద్రమోదీ తమిళ సంస్కృతీ సంప్రదా యాలను, భాషను, తమిళులను కించపరుస్తున్నారన్నది బహిరంగమే. తమిళ పదాలు ఉచ్ఛరిస్తూ.. తమిళుల్ని మోసం చేయాలనుకుంటున్నారు. కానీ..మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయలేదరన్నదే వాస్తవం. తమిళ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల్ని పరిష్కరించేందుకే వచ్చా. నేను తమిళుడ్ని కాదు. కానీ.. తమిళాన్ని గౌరవిస్తా. మీ ఇంటి బిడ్డనన్న విషయాన్ని తెలుసుకోండి’’ అంటూ భావోద్వేగపు వ్యాఖ్యల్ని చేశారు. ఇదే రీతిలో రాహుల్ ప్రసంగ జోరు సాగితే.. తమిళులు ఆయనకు కనెక్టు అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News