రాహుల్ ఎప్పుడొస్తాడో ఏమో ?

Update: 2021-09-09 15:17 GMT
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధి వ్యవహారమే ఇపుడు చర్చనీయాంశంగా మారిపోయింది. పార్టీకి ప్రస్తుతం పూర్తిస్ధాయి అధ్యక్షులు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. అధ్యక్షపదవికి రాహుల్ రాజీనామా చేసిన దగ్గరనుండి ఆరోగ్యం బాగాలేకపోయినా  మళ్ళీ సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్నారు. సోనియా పరిస్ధితి వందేళ్ళని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దుస్ధితిని చెప్పకనే చెబుతోంది. కారణం ఏమిటంటే ఆరోగ్యం సహకరించకపోయినా సోనియానే బాధ్యతలు చూసుకుంటున్నారంటే ఇంతకన్నా బాధాకరం ఏముంది ?

ఒకవైపు ఈమధ్యనే గోవాలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) జాతీయ సభలు జరిగింది. ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీయే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానాలు, డిమాండ్లు బాగానే ఉన్నాయి కానీ అసలు రాహుల్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎందుకంటే 2017లో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రాహుల్ 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘోరఓటమికి బాధ్యత వహిస్తు రాజీనామా చేశారు.

రాజీనామాను వాపసు తీసుకోవాలని ఎంతమంది సీనియర్లు డిమాండ్లు చేసినా రాహుల్ మాత్రం స్పందించలేదు. రాహుల్ ఎందుకు రాజీనామాను వాపసు తీసుకోలేదంటే అసలు సమస్య సీరనియర్లే కాబట్టి. సీనియర్లు రాహుల్ ను తమ గుప్పిట్లో బంధీగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీలోనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్లను కాదని అధ్యక్షస్ధానంలో ఉన్న రాహుల్ ఏమి చేయలేకపోయారు. అలాగే ఇపుడు సోనియా కూడా ఏమీ చేయలేకపోతున్నారు.

సీనియర్ల చేతిలో పార్టీ బందీగా ఉన్నంత వరకు అధ్యక్షునిగా ఉండి  ఉపయోగం లేదని రాహుల్ గట్టిగా డిసైడ్ అయిన కారణంగానే ప్రెసిడెంట్ గా ఉండటానికి ఇష్ట పడటంలేదని సమాచారం. ఇదే సమయంలో అధ్యక్షునిగా తాను బాధ్యతలు తీసుకోవాలంటే తనకు మద్దతుగా యువనేతలనే ఎక్కువగా ఉంచుకోవాలని రాహుల్ అనుకుంటున్నారట. అయితే అత్యున్నత స్ధానాలకు సరైన యువనేతలు దొరకటంలేదట. కాబట్టే పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకోవటానికి ఇష్టపడటం లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

పైగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి తొందరలోనే. ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశలు ఒక్క పంజాబ్ లో మాత్రమే. అదికూడా అమరీందర్-నవ్ జోత్ మధ్య గొడవల్లో దెబ్బ తినేట్లుంది. కాబట్టి ఇక నాలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో మరీ అన్యాయంగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు బాధ్యతలు తీసుకుని ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ గా ముద్ర వేయించుకునే కన్నా కొద్ది రోజులు ఆగటమే మేలని కూడా కొందరు రాహుల్  కు సలహా ఇచ్చారట. మరి చివరకు రాహుల్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News