ర‌ఘువీరా నోట రివ‌ర్స్ మైగ్రేష‌న్ మాట‌!

Update: 2018-08-17 05:57 GMT
ఐదు కోట్ల మంది ఆంధ్రుల భ‌విష్య‌త్తును అంధ‌కారంలో నెట్టేస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌యంతో.. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ముక్క‌లైన సంగ‌తి తెలిసిందే. త‌మ‌ను చావుదెబ్బ తీసిన కాంగ్రెస్ కు త‌గిన‌శాస్తి చేసేలా ఏపీ ప్ర‌జ‌లు తీసుకున్న నిర్ణ‌యం తెలిసిందే.

ప‌దేళ్ల పాటు నాన్ స్టాప్ అధికారాన్ని అనుభ‌వించిన కాంగ్రెస్ కు.. ఒక్క‌రంటే ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించ‌కుండా ఓట‌మితో ఆ పార్టీకి ఆంధ్రాలో స‌మాధి క‌ట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి నాలుగున్న‌రేళ్లు అవుతున్నా.. ఇప్ప‌టికి కాంగ్రెస్ ప‌రిస్థితి ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ఏపీ ద‌శ‌ను.. దిశ‌ను మార్చే ప్ర‌త్యేక హోదాపై ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో పాజిటివ్ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టమే కాదు.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగంలోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న మాట‌ను స్ప‌ష్టం చేశారు.

దీంతో.. కాంగ్రెస్ మీద ఇప్పుడిప్పుడే కొంత సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతుఏ్న ప‌రిస్థితి. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఎడిట‌ర్స్ మీట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో తాము ఎలాంటి ప్రభావితం చేయ‌లేమ‌న్న మాట‌ను చెప్పేశారు. గెలుపు అవ‌కాశాలు లేవ‌ని తేల్చేశారు. ఇది చాలు.. ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది చెప్ప‌టానికి. ఇదిలా ఉంటే.. ఏపీ కాంగ్రెస్ పార్టీ సార‌ధి మాత్రం గొప్ప‌లు చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం.

త‌మ పార్టీలోకి రివ‌ర్స్ మైగ్రేష‌న్ స్టార్ట్ అయ్యింద‌ని.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. పెద్ద సంఖ్య‌లో నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెబుతున్నారు. ఏపీకి ఇచ్చే హోదా విష‌యంలో బీజేపీ ఇవ్వ‌న‌ని తేల్చేయ‌గా.. రాహుల్ గాంధీ మాత్రం అందుకు భిన్నంగా హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌న్నారు. ప్ర‌క‌ట‌న మాత్ర‌మే చేశారు కానీ.. హెదా మీద స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న  చేయ‌లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. 2004 ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాన‌ని చెప్పి.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే తెలంగాణ‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటి చావు తెలివితేట‌ల్ని ఏపీ విష‌యంలో ప్ర‌ద‌ర్శించ‌ర‌న్న గ్యారెంటీ ఏమీ లేదు. ఇలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ ను తొంద‌ర‌ప‌డి ఆంధ్రోళ్లు న‌మ్మ‌లేర‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోయి రఘువీరా హ‌డావుడి ప్ర‌క‌ట‌న‌లు ఆంధ్రోళ్ల‌కు మ‌రింత ఒళ్లు మండేలా చేస్తాయ‌న్న ఆలోచ‌న లేక‌పోతే ఎలా ర‌ఘువీరా?
Tags:    

Similar News