బీజేపీ వ‌ద్దే వ‌ద్దు... జ‌గ‌నే ముద్దంటోన్న ర‌ఘువీరా ?

Update: 2021-07-15 10:30 GMT
దేశవ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణలో కొద్దోగొప్పో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వడంతో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేరు... క్యాడర్ కూడా కరువైంది. గత రెండేళ్లలో అక్కడ అక్కడా మిగిలి ఉన్న సీనియర్ నేతలు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుక్కుంటారు. ఈ క్రమంలోనే మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి సైతం ఇప్పుడు రాజకీయంగా కొత్త దారులు వెతుక్కుంటున్నారా ? అంటే అవున‌నే అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ర‌ఘువీరా 2014లో పెనుగొండ నుంచి, 2019లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి ఓడారు. అయితే ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు అందరికంటే గౌరవప్రదంగా ఓట్లు దక్కించుకున్నారు.

కొద్దిరోజులుగా తన స్వగ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటోన్న ఆయన ఆధ్యాత్మిక చింతనతో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన స్వగ్రామంలో రెండు దేవాలయాలను జీర్ణోద్ధ‌రించారు. ఈ పరిణామాలతో ఆయన బిజెపిలోకి వెళతారా ? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ర‌ఘువీరా ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకి దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. ఆయ‌న‌ స్నేహితులు, పాత కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. వీళ్లంతా ఆయ‌న్ను వైసీపీలోకి ర‌మ్మ‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అనంత‌పురం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అనంత వెంక‌ట్రామిరెడ్డి, తిప్పేస్వామితో ఆయ‌న ఎంతో స‌న్నిహితంగా ఉంటారు. పైగా మ‌డ‌క‌శిర‌లో గ‌త ఎన్నిక‌ల్లో తిప్పేస్వామి గెలుపున‌కు ర‌ఘువీరా సాయం చేశారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ తిప్పేస్వామికి స‌పోర్టుగా ఉన్నారు. వీరిద్ద‌రు ఇటీవ‌లే ర‌ఘువీరాను క‌లిసి వైసీపీలో చేరాల‌ని ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. ఇక వైసీపీలో కీల‌క మంత్రిగా ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ర‌ఘువీరాతో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

బొత్స సైతం అధిష్టానం సూచ‌న మేర‌కే ర‌ఘువీరాతో ట‌చ్‌లోకి వెళ్లార‌ని అంటున్నారు. 1989 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న 1994, 2014, 2019 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఓడిపోయారు. ఇక త‌న పాత టీం అంతా టీడీపీ, వైసీపీలోకి వెళ్లిపోయి రాజ‌కీయంగా ఫామ్‌లో ఉన్నా ర‌ఘువీరా మాత్రం ఇంకా కాంగ్రెస్‌నే ప‌ట్టుకుని వేలాడుతున్నారు.

ఇక ర‌ఘువీరా అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్ సైతం ఆయ‌న్ను ముందుగా పార్టీలోకి ర‌మ్మ‌ని చెప్పండం.. ఎలా న్యాయం చేయాలో ?  నేను చూసుకుంటాన‌ని అన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా రఘువీరా అడుగులు వైసీపీ వైపే ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News