ప్ర‌మాణ‌మే ప్ర‌మాదమైంది... పుదుచ్ఛేరి సీఎంకు క‌రోనా

Update: 2021-05-10 05:33 GMT
కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్ఛేరికి ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త రంగ‌సామికి ఆ సంబ‌రం ఎంతోకాలం నిల‌వ‌లేదు. మొన్న‌టి ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి త‌ర్వాత ఆరేళ్ల విరామం త‌ర్వాత రంగ‌సామి సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. అయితే ఆ ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ‌మే ఆయ‌న‌ను ప్ర‌మాదంలో ప‌డేసింద‌ని చెప్పాలి. పుదుచ్ఛేరి సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన రంగ‌సామి ఇప్పుడు క‌రోనా బారిన ప‌డిపోయారు. వెర‌సి సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోజుల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న చికిత్స కోస‌మంటూ చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింది.

త‌మిళ‌నాడు అసెంబ్లీతో పాటు పుదుచ్ఛేరి అసెంబ్లీకి కూడా ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రంగ‌సామి విజ‌యం సాధించారు. అంతేకాకుండా ఆయ‌న పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన వారు మెజారిటీ స్థానాల్లో విజ‌యం సాధించ‌లేక‌పోయినా... బీజేపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన వారిని క‌లుపుకుని రంగ‌సామి పుదుచ్ఛేరిలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం రంగ‌సామి కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేల‌కు కూడా స్థానం ద‌క్క‌నుంది.

ఇక్క‌డిదాకా బాగానే ఉన్నా.... ఈ నెల 7న‌ పుదుచ్ఛేరిలో నిర్వ‌హించిన అధికారిక కార్య‌క్ర‌మంలో ఇంచార్జీ లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై... రంగ‌సామితో సీఎంగా ప్ర‌మాణం చేయించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని అంత గ్రాండ్ గా ఏమీ చేయ‌కున్నా... అతి త‌క్కువ సంఖ్య‌లో అయినా అతిథులు హాజరు కావాల్సిందే క‌దా. అయితే క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ఎందుకైనా మంచిద‌న్న భావ‌న‌తో ఆదివారం పుదుచ్ఛేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి నిన్న పరీక్షలకు వెళ్లిన రంగ‌సామికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందట. ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు నిన్న సాయంత్రమే బయలుదేరి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News