పాలకొండలో అసలైన పాలిటిక్స్
ఇదిలా ఉంటే టీడీపీకి ఇంచార్జిగా పడాల భూదేవి వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా 2024 ఎన్నికల్లో టికెట్ ని ఆశించారు ఆమె సైతం టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు.;
ఉత్తరాంధ్రలో జనసేన 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అది కూడా ఉమ్మడిగా ఉన్న మూడు జిల్లాలలో గెలిచి తన సత్తాను చాటింది. ఇంకా విశేషం ఏంటి అంటే ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట వైసీపీకి పట్టు ఉన్న చోట జనసేన నెగ్గడం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వుడ్ సీట్లో జనసేన తొలిసారి గెలిచింది. ఇక్కడ నుంచి నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యెగా మొదటి సారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతవరకూ బాగానే ఉంది కానీ అక్కడ నుంచే అసలైన పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయిందిట.
ఇరవై నెలలుగా ఇదే తీరు :
ఇక జయక్రిష్ణ ఎవరో కాదు, ఆయన టీడీపీలో సీనియర్ నేత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ చేతిలో ఓటమి చెందిన ఆయన 2024 ఎన్నికలకు వచ్చేసరికి జనసేన నుంచి పోటీకి దిగారు. ఇక ఆయన గెలుపునకు పూర్తిగా సహకరించినది టీడీపీ క్యాడర్. ఎందుకంటే జయక్రిష్ణకు పాలకొండలో టీడీపీలో ఉన్న పట్టు. వారు అంతా తమ నేత కాబట్టి జనసేన జెండా అయినా గెలిపించారు ఇక గెలిచిన తరువాత నుంచి కూడా జయక్రిష్ణ టీడీపీ నేతలతోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒక విధంగా ఆయన అనధికార టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక జనసేనకు కూడా పెద్దగా బలం లేకపోవడంతో ఆయన తన టీడీపీ బలన్ని అలాగే అట్లే పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
ఇంచార్జితో వార్ :
ఇదిలా ఉంటే టీడీపీకి ఇంచార్జిగా పడాల భూదేవి వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా 2024 ఎన్నికల్లో టికెట్ ని ఆశించారు ఆమె సైతం టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఎటూ జయక్రిష్ణ పార్టీని వీడి వెళ్ళిపోయారు కదా అని ఆమె పార్టీలో దూకుడుగా ఉంటున్నారు. అయితే జయక్రిష్ణ టీడీపీలో వర్గ పోరుకు తెర తీయడం తనతో చాలా మంది నాయకులను కలుపుకుని పోవడంతో పాలకొండ టీడీపీలో రెండు వర్గాలు తయారు అయ్యాయని అంటున్నారు. ఒక వర్గం ఎమ్మెల్యేతో ఉంటే మరో వర్గం భూదేవితో ఉంటోంది. ఇక పార్టీ పదవులలో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఎమ్మెల్యేతో ఉన్న వారికి పదవులు ఇచ్చేది లేదని భూదేవి అనుచరులు చెబుతున్నారు. అదే అమలు చేస్తున్నారు. దాంతో వర్గ పోరు హెచ్చుగా సాగుతోంది.
కూటమిలో చిచ్చుగా :
ఈ నేపధ్యంలో కూటమిలో కూడా చిచ్చుగా ఇది మారింది. ఎమ్మెల్యే వేదిక మీద ఉంటే టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న భూదేవి అక్కడ కనిపించడంలేదు అని అంటున్నారు. ఆమె వర్గం వేరు ఆమె కార్యక్రమాలు వేరు, అలాగే ఎమ్మెల్యేతో కలసి మరో టీడీపీ వర్గం హవా చలాయ్స్తోంది. ఇలా కూటమిలో వర్గ పోరు గట్టిగానే ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేనలో ఎమ్మెల్యే ఉంటూ టీడీపీ వారితో కలసిమెలసి ఉండడం వారికి మేలు చేసేలా వ్యవహరించడం ఒరిజినల్ జనసేన నేతలకు అసలు నచ్చడం లేదని అంటున్నారు. తమ పార్టీ గెలిచింది తమకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ విధంగా ఏమీ జరగకపోవడం మీద కూడా జనసేనలో అసంతృప్తి ఉందని అంటున్నారు. కూటమి పార్టీలు ఐక్యంగా ఉండాలని పై స్థాయిలో చెబుతూంటే క్షేత్ర స్థాయిలో చూస్తే సీన్ ఇలా ఉందని అంటున్నారు.