కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు లేకుండానే ప్రమోషన్‌ !

Update: 2020-04-02 12:30 GMT
కరోనా వైరస్ ... ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం గజగజవణికిస్తుంది.  కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. దీనితో ప్రతి ఒక్కటి మూతబడిపోయింది. జన జీవనం స్తంభించింది. ఇకపోతే దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు మధ్యలోనే బ్రేక్ పడింది. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో ఏప్రిల్ 15 వరకూ విద్యార్థులందరూ ఇళ్లకే పరిమితం కానున్నారు.

ఈ నేపథ్యంలో సీబీఎస్ ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులందర్నీ ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారంతా పై తరగతులకు ప్రమోట్ అయ్యారని సీబీఎస్ ఈ తెలిపింది. మరోవైపు 9వ తరగతి, 11వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్, నెలవారీ పరీక్షలు, టెర్మ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు. అలాగే పది, పన్నెండో తరగతి చదివే విద్యార్థులకు కూడా ప్రధానమైన 29 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు.

కేంద్ర మానవ వనరుల మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ సూచనల మేరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమోట్ కాని విద్యార్థులు పాఠశాలలు నిర్వహించే ఆన్‌ లైన్ లేదా ఆఫ్‌ లైన్ టెస్టుకు హాజరు కావచ్చని మంత్రి తెలిపారు. యూనివర్సిటీల్లో ప్రవేశం కొరకు అతి కీలకమైన ఈ 29 పరీక్షలు ఎప్పుడు పెట్టేది, ఎలా నిర్వహించాలనేది పదిరోజుల ముందు తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది. 25 దేశాల్లో సీబీఎస్‌ ఈ స్కూళ్లున్నాయని,  కరోనా వల్ల అక్కడా లాక్‌ డౌన్‌ అమలుచేస్తున్నందున కొంతకాలం మూసివేయాలని నిర్ణయించినట్టు సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్‌ త్రిపాఠి తెలిపారు.  కరోనా, లాక్‌ డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైకోర్టు జోక్యంతో తెలంగాణలో పది పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ విద్యార్థులకు కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కారు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News