శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడారు?

Update: 2021-12-26 04:20 GMT
దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఒక అరుదైన అలవాటు గురించి అందరికి తెలిసిందే. ఏదైనా కీలక నిర్ణయాన్ని ప్రకటించటానికి ముందు.. ఆయనే జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. దానికి ముందు.. ఒక ట్వీట్ కానీ లేదంటే ఒక అధికారిక ప్రకటన కానీ వెలువడుతుంది. ప్రధాని మరికాసేపట్లో కీలక ప్రకటన చేస్తారని కానీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కానీ. ఇప్పటివరకు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న ఏ ప్రధాని కూడా తన పదవీ కాలంలో మోడీ మాదిరి పదే పదే జాతిని ఉద్దేశించి మాట్లాడింది లేదు.

శనివారం రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత అనూహ్యంగా ఒక ప్రకటన వెలువడింది. మరోగంటలో మోడీ .. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని. చెప్పినట్లే ఆయన టీవీ తెరల మీదకు వచ్చారు. కీలక ప్రకటన చేశారు. మరో ఆరు రోజుల్లో మొదలు కానున్న కొత్త సంవత్సరంలో పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. అదే సమయంలో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పెద్ద వయస్కుల వారికి.. వైద్య రంగంలోని వారికి.. ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న వేళ.. సదరు వేరియంట్ వైరస్ దేశంలో వ్యాప్తిస్తూ.. కేసులు పెరుగుతున్న వేళ మోడీ నోట ఈ రెండు కీలక ప్రకటనలు వెలువడటం గమనార్హం.

తాజా ప్రకటనతో.. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. దేశంలో 15-18 ఏళ్ల మధ్య పిల్లలు దాదాపు 10 కోట్ల మంది వరకు ఉంటారు. వారందరికి జనవరి 3న కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లుగా మోడీ ప్రకటించారు. ఇక.. పెద్ద వయస్కులు.. వైద్యులకు.. ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులను జనవరి 10 నుంచి ఇవ్వనున్నారు.

శాస్త్రవేత్తలు సమగ్రంగా పరీక్షలు చేసిన తర్వాతే బూస్టర్ డోస్ కు అనుమతి ఇచ్చారని మోడీ వెల్లడించారు.ఎప్పుడు ఏ డోసు తీసుకోవాలో మన శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ గురించి దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ తో ముప్పు తొలిగిపోలేదని.. ఇప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం వేళ ప్రజలంతా ఆశాభావంతో కూడిన సంబరాలతో ఆహ్వానిస్తున్న వేళ.. కరోనా వ్యాప్తి గురించి మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ జాగ్రత్తలు.. వ్యాక్సినేషన్ మన ప్రధాన ఆయుధాలని వెల్లడించారు.  జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోడీ రెండు కీలక ప్రకటనలు చేశారని చెప్పాలి.
Tags:    

Similar News