ఇండియాలో హిట్లర్లు తయారవుతున్నారా?

Update: 2016-06-26 07:26 GMT
 ‘‘నేను మోనార్కుని.. నన్నెవరూ మోసం చేయలేరు’’ ఈ డైలాగు గుర్తుందా? అప్పుడెప్పుడో వచ్చిన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ చెప్పిన ఈ డైలాగును జనం ఇప్పటికీ మర్చిపోలేదు. పాలకులకు కూడా ఆ డైలాగు బాగా నచ్చినట్లుంది. అందుకే మోనార్కిజాన్ని ఆచరించి చూపిస్తున్నారు. తమను ప్రశ్నించినవారిని.. తమను విమర్శించినవారిని.. లోపాలు ఎత్తి చూపిన వారిని అణగదొక్కేందుకు - అరెస్టు చేసేందుకు - కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కేసులు పెడతామని కొందరు బెదిరిస్తుంటే ఇంకొందరు కేసులు పెడుతున్నారు కూడా. అవును.. కేంద్ర ప్రభుత్వం - రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. తమనెవరూ ప్రశ్నించరాదన్న నిరంకుశత్వం అడుగడుగునా కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలు 65 మందిని ఒకేసారి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ర్టాల్లోనూ పాలక పక్షం అధికార దుర్వినియోగం తక్కువేమీ కాదు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే విపక్షాలకు - పత్రికలకు వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని.. పరువు నష్టం వేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. తాజాగా కేసీఆర్ పై అనుచిత విమర్శలు చేశారన్న కారణంతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు పెట్టారు. తెలంగాణలో ఇంతకుముందు కొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకుని చాలాకాలం మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినా - ప్రసారం చేసినా యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపెన్ గా చెప్పారు. ఇప్పటికే కొన్ని ఛానళ్ల ప్రసారాలను ఆపేశారు. మీడియా సంఘాల ఒత్తిళ్లతో ప్రసారాలను పునరుద్ధరించినప్పటికీ ఈ పరిణామాలు మిగతా మీడియా వర్గాల్లో భయాన్ని కలిగించాయి.  వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మానంలో లోపాలపై వార్తలు రాస్తుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారు. అలాంటి వార్తలు అసలు రాయొద్దంటూ ఆయన ఏం రాయాలో ఏం రాయకూడదో కూడా చెబుతున్నారు. మొత్తానికి ప్రజాస్వామ్య భారతంలో పాలకులు నిరంకుశత్వానికి ప్రతీకలుగా నిలుస్తుండడం ప్రమాదకరంగానే కనిపిస్తోంది.

తమిళనాడు - పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు - ధోరణలు కనిపిస్తుండడంతో భారత దేశంలో హిట్లర్లు తయారవుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినా పాలన మాత్రం నిరంకుశమవుతోందా అన్న చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News