పీకేతో లెక్క తేడా వస్తే.. వేటగాడిలా వేటాడతాడా?

Update: 2021-12-03 05:32 GMT
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి.. తరచూ ఏదో ఒక అంశం మీద వార్తల్లో కనిపిస్తుంటారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. కొద్ది నెలల క్రితం ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు రావటం తెలిసిందే. దేశ ప్రధాని కుర్చీలో రాహుల్ గాంధీని కూర్చోబెడతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆ దిశగా తాను పని చేస్తున్నట్లుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు వరకు నితీశ్ కు చెందిన జేడీయూలో భాగస్వామిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పటం తెలిసిందే.

తాను కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా సంకేతాల్ని ఇచ్చిన ఆయన.. అందులో భాగంగా రాహుల్ తో భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆయన కాంగ్రెస్ జపం చేయటాన్ని బంద్ చేశాడు. ఆ తర్వాత నుంచి రాహుల్ మీదా.. కాంగ్రెస్ మీదా విమర్శలు చేయటం షురూ చేశారు. తాజాగా మరోసారి అలాంటి తీరునే ఆయన ప్రదర్శించారు.

బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైనదన్న ఆయన.. గడిచిన పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తికి ఉన్న దైవ దత్త హక్కు కాదన్నారు. ఇటీవల కాలంలో తన సేవలు అందిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్ని కమ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోటి నుంచి యూపీఏ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించిన తర్వాతి రోజునే పీకే నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీని.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రంగంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదంతా చూస్తే.. తనతో డీల్ ఓకే అయితే పర్లేదు కానీ.. తేడా వస్తే మాత్రం తానెంతలా వెంటాడతానన్న విషయాన్ని పీకే తన మాటలతో స్పష్టం చేస్తున్నారని చెప్పాలి. పీకే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ కామ్ గా ఉండటం చూస్తే.. ఎందుకిలా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.




Tags:    

Similar News