ఒడిశా ఇష్యూ తెలుసుకున్నాకే పోస్కోతో ప్లాన్ చేయండి జ‌గ‌న్‌!

Update: 2019-06-21 05:31 GMT
ఉక్కు దిగ్గ‌జ కంపెనీల్లో పోస్కో ఒక‌టి. ద‌క్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ క‌న్నేసిందంటే మాట‌లు కాదు. ఈ కంపెనీ స‌మ‌ర్థ‌త గురించి ఎవ‌రూ వేలెత్తి చూపించ‌రు. కానీ.. స‌మ‌స్య‌ల్లా త‌మ ప్ర‌యోజ‌న‌మే త‌ప్పించి మ‌రింకేమీ ఆ సంస్థ‌కు ప‌ట్ట‌ద‌న్న పేరుంది. ఉక్కు రంగంలో తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించే ఈ సంస్థ తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో భేటీ అయ్యింది.

ఏపీలో స‌మీకృత ఉక్కు క‌ర్మాగారాన్ని నెల‌కొల్పేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించింది. ఈ కంపెనీ సీఈవో బాంగ్ గిల్ హో నేతృత్వంలోని ప్ర‌త్యేక బృందం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాజాగా క‌లిసింది. ఏపీలో తాము ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్ప‌టంపై సాధ్యాసాధ్యాల్ని ప‌రిశీలించేందుకు రాష్ట్రానికి త‌మ టెక్నిక‌ల్ బృందాన్ని పంప‌నున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు.

పోస్కోతో ఒప్పందం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉందన్న మాట వినిపిస్తోంది. ఒడిశాలో ఈ కంపెనీ అడుగు పెట్టిన త‌ర్వాత జ‌రిగిన ఆందోళ‌న‌లు అన్ని ఇన్ని కావు. ప్ర‌శాంతంగా ఉండే ఒడిశాలో పోస్కో ర‌చ్చ అంతా ఇంతా కాద‌న్న విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తుంటారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ స‌ర్కారు మీద ఉంది.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ముఖ్య‌మ‌ని భావించే జ‌గ‌న్ లాంటివారు పోస్కోతో ఒప్పందం చేసుకునే ముందు.. ఒడిశా ఎపిసోడ్ ను పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేసిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. లేని ప‌క్షంలో కోరి క‌ష్టాన్ని నెత్తికి చుట్టుకున్న‌ట్లు అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. పోస్కోతో కాస్త కేర్ ఫుల్ గా ఉండాల‌ని జ‌గ‌న్ శ్రేయోభిలాషులు ప‌లువురు కోరుకుంటున్న ప‌రిస్థితి.
Tags:    

Similar News