వైసీపీ ఎంపీకి గాడిద పాలు కావాలట!!

Update: 2015-12-05 10:45 GMT
తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న వైసీపీ నుంచి అదృష్టవశాత్తు గెలిచిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంటులో విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. రీసెంటుగా ఆయన అడిగిన ఓ ప్రశ్న విన్నవారు ఇంతకుమించి ఆయనకు సమస్యలే కనిపించలేదా అని విమర్శిస్తున్నారు. గాడిదపాలలో ఉన్న ఔషధ గుణాల గురించి వైసీపీ ఎంపీ ప్రశ్న అడగడంపై రాజకీయంగా రకరకాల సెటైర్లు పడుతున్నాయి.

వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంటులో ఓ ప్రశ్న అడిగారు. గాడిదపాలలో ఎలాంటి ఔషధగుణాలున్నాయి... దానిపై ఏమైనా పరిశోధనలు జరుపుతున్నారా అని ఆయన అడిగారు. పాపం.. ఎంపీగారు అడిగాక మంత్రులకు సమాధానం చెప్పక తప్పదుకదా. అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చారు. గాడిదపాలపై ఇంతవరకు ప్రభుత్వం తరఫున పరిశోధనలేమీ చేయలేదని చెప్పారు. అయితే రాజస్థాన్ లో గుర్రపు జాతి జంతువులకు సంబంధించిన ప్రయోగ శాల ఒకటుందని.. అందులో గుర్రాలపై పరిశోధన చేయగా వాటి పాలలో వెన్నశాతం వంటివివరాలు తెలిశాయని... గాడిద పాలలోనూ దాదాపుగా అలాగే ఉండొచ్చని పేర్కొన్నారు.

అయితే... మంత్రి గాడిద పాల గురించి సమాధానం చెబుతున్నప్పుడు ముందుగా ఫాలోకాని చాలామంది సభ్యులకు ఓ డౌటొచ్చింది. ఈ ప్రశ్న అడిగింది ఎవరా అని లోక్ సభలో ఉన్నవారంతా తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారట. వైసీపీ ఎంపీ ఈ ప్రశ్న అడిగారని తెలుసుకున్నారు. సభామర్యాద ప్రకారం పైకి ఏమీ అనకపోయినా చాలామంది సీనియర్లు తెలంగాణలో ఇంతకీ ఈయనకు వేరే సమస్యలే కనిపించలేదా.. గాడిద పాలుపై ప్రశ్న అడిగారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Tags:    

Similar News