జగన్ కు హ్యాండిచ్చి పొంగులేటి వెళ్లిపోయాడు

Update: 2016-05-02 12:39 GMT
రాజకీయాలు చాలా కర్కసమని చెబుతుంటారు. ఆ మాట ఎంత నిజమన్న విషయం తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్న పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థం కావాల్సిందే. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదా ఇచ్చేసి.. రాష్ట్రం మొత్తం ఆ పార్టీ బాగోగులు చూసుకోమన్నా కూడా కుదరదని.. గుంపులో గోవిందంగా మారటానికి సిద్ధమయ్యారంటే.. ఉన్నపార్టీలో లేనిదేంటి? వెళ్లే పార్టీలో ఉన్నదేంటన్నది చూస్తే.. ‘‘పవర్’’ అన్న మూడు అక్షరాలు కనిపిస్తాయి. అధికారం లేకుండా ఎన్ని పదవులు ఉంటే మాత్రం విధేయుడిగా ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తేల్చేశారు తెలంగాణ వైఎస్సార్ అధ్యక్ష స్థానంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

గత కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చాపలా చుట్టేసి.. తెలంగాణ అధికారపక్షానికి దఖలు చేస్తారంటూ ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని చెప్పుకొస్తున్న పొంగులేని.. చివరకు తాను చెప్పిన మాట కంటే తన మీద జరిగిన ప్రచారమే నిజమన్న విషయాల్ని తేల్చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ అధికారపక్ష తీరును నిరసిస్తూ నిరసన దీక్ష చేస్తానంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయనకు భారీ షాక్ ఇస్తూ తెలంగాణ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.

తాజా ఉదంతంతో తన బంగారు పుట్టలో వేలెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పినట్లైంది. ఇంత జరిగిన తర్వాత కూడా జగన్ సంతోషించాల్సిన అంశం ఏమైనా ఉందంటే.. పార్టీ నుంచి వీడిపోయిన పొంగులేటి అధినేత మీద చేసిన వ్యాఖ్యలే. జగన్ మీద ఎలాంటి విమర్శ చేయకుండా.. ఆయన ఆంధ్రా కోసం పని చేస్తున్నారన్న మాట చెప్పేశారు. ఏపీలో మాదిరి పార్టీ మారుతున్న వారంతా జగన్ మైండ్ సెట్ మీద.. ఆయన వ్యవహారశైలి మీద సునిశిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పొంగులేటి అలాంటిదేమీ లేకుండా తెలంగాణ ప్రయోజనాల కోసంతాను పార్టీ మారుతున్నట్లుగా చెపేశారు. మొత్తంగా చూస్తే.. దెబ్బ మీద దెబ్బ పడుతున్న జగన్ కు తాజా పరిణామం మరో విషమ పరిస్థితేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News