కోడెల మరణం... పోలీసులు ఏం చెప్పారు?

Update: 2019-09-16 10:55 GMT
కోడెల మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న అనంతరం ఆయన్ను ఇతర ఆస్పత్రులకు కాకుండా క్యాన్సర్ ఆస్పత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండగా... పోలీసులు మాత్రం పోస్టు మార్టం నివేదిక తర్వాత స్పందిస్తామని ప్రకటించారు. వైద్యుల నివేదిక తర్వాత కోడెల శివప్రసాదరావు మృతిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

కోడెల 11 గంటల సమయంలో తన పడకగదిలో పడిపోయి ఉన్నట్లు... కుటుంబసభ్యులు గమనించారని, ఆయన భార్య - కుమార్తె - పనిమనిషి కలిసి ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. ఆస్పత్రికి చేరేటప్పటికే కోడెల చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని డీసీపీ చెప్పారు. ప్రాథమిక విచారణలో కుటుంబసభ్యుల సమాచారం మేరకు కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిసిందని... పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని - పోస్టు మార్టం అనంతరం దర్యాప్తు ఏ కోణంలో చేయాల్సిందీ ఒక అవగాహన వస్తుందన్నారు. ప్రస్తుతానికి అయితే సంఘటనా స్థలం పరిశీలించాక, కోడెల మృతిపై ప్రాథమికంగా ఏ అనుమానాలు రాలేదన్నారు.  రాత్రి కోడెల ఇంట్లో గొడవ జరిగినట్లు వస్తున్న వార్తలు కూడా నిజం కాదన్నారు. కోడెల మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కోడెల మృతదేహానికి ఉస్మానియాలో పోస్టు మార్టం చేస్తున్నారు.


Tags:    

Similar News