అనంతలో టీడీపీ మహిళా నేతలకు పోలీసుల టార్చర్?

Update: 2021-11-26 05:38 GMT
అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తుంటారంటూ విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కోవటం పోలీసులకు మామూలే. అయితే.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. మరే రాష్ట్రంలోనూ పోలీసులు ఎదుర్కోని విమర్శల్ని ఏపీ పోలీసులు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్నట్లుగా చెప్పొచ్చు. ఇందుకు తగ్గట్లే వారి తీరు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

తాజాగా అనంతపురంలో ఎదురైన పరిస్థితుల గురించి మీడియా వస్తున్న రిపోర్టులు ఆందోళన కలిగించేలా మారాయి. ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పై రగిలిన రాజకీయ రచ్చ గురించి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై టీడీపీ నేతలు పలువురు తీవ్రంగా ఖండించారు.

పార్టీ కి చెందిన మహిళా నేతలు సైతం బయటకు వచ్చి మీడియా తో మాట్లాడారు. ఆ సందర్భం గా పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేశారు. ఇలా చేసిన వారి లో అనంతపురం జిల్లాకు చెందిన మహిళా నేతలు ఉన్నారు. వారి లో ఎక్కువ మంది జిల్లా కేంద్ర మైన అనంతపురానికి చెందిన వారు. వీరు చేసిన ఘాటు విమర్శల పై వైసీపీ మహిళా విభాగానికి చెందిన నేతలు పోలీసులకు కంప్లైంట్ చేయటం తో వారు రంగం లోకి దిగారు.

ఈ సందర్భం గా వారు వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. అధికార పక్షానికి చెందిన వారు ఫిర్యాదు ఇచ్చినంతనే రంగం లోకి దిగిన అనంతపురం పోలీసులు చెల రేగిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు అన్నది కూడా చూడకుండా.. కేసులు పెట్టటమే కాదు.. వారిని పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పటం.. వారిని స్టేషన్లో గంటల కొద్దీ వెయిట్ చేయించి.. మళ్లీ ఇంటికి పంపటం లాంటివి చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గురువారం అనంతపురం లోని పలువురు టీడీపీ మహిళా నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. మీడియా తో ఎందుకు మాట్లాడారు? వైసీపీ నేతల్ని ఎందుకు విమర్శించారు? డబ్బులు తీసుకొని మాట్లాడారా? తాయిలాలు చూపించి మిమ్మల్నితిట్టేలా చేశారా? అంటూ విచిత్రమైన ప్రశ్నలతో పాటు.. వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన వైనం షాకింగ్ గా మారింది.

పోలీసుల వేధింపులకు తట్టుకోలేని టీడీపీ మహిళా నేత ప్రియాంక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. పోలీసుల తీరు ఎలా ఉందన్న దానికి నిదర్శనంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

వైసీపీకి చెందిన మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు.. తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నేతల ఇళ్లకు ఉదయాన్నే వచ్చేసి.. సెల్ ఫోన్లు తీసుకొని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇలా టీడీపీమహిళా నేతలు స్వప్న.. విజయశ్రీ.. తేజస్విని.. జానకి ఇళ్ల పై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి నేతృత్వంలో ప్రతి మహిళా నేత ఇంటికి ఇద్దరు సీఐలను.. ఎస్ఐలతో పాటు ప్రత్యేక పోలీసులు వెళ్లటం.. సోదాలు చేసే సమయంలో ఇంట్లోని వారి సెల్ ఫోన్లు అన్ని తీసేసుకున్నారు.

దీంతో.. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ మహిళా నేత స్వప్న.. ఆమె భర్తలు ఇద్దరూ రోడ్డు మీదకు వచ్చి బైఠాయించారు. నిరసన చేపట్టారు. పోలీసుల తీరును తప్పు పట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నేతలు.. కార్యకర్తలు స్వప్న ఇంటిని వద్దకు భారీగా చేరుకున్నారు.

దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు చేపట్టి.. ఇంట్లోని ప్రతి వస్తువును తనిఖీ చేశారు. స్వప్న ఇంట్లో లభించిన రూ.4లక్షల నగదు గురించి పెద్ద ఎత్తున ఆరా తీశారు. మీరు మీడియా సమావేశంలో ఎందుకు మాట్లాడారు? ఎవరైనా డబ్బులిచ్చి మాట్లాడించారా? ఎంత డబ్బు ఇచ్చారు? లాంటి ప్రశ్నలల్ని వేసినట్లుగా చెబుతున్నారు.

పోలీసుల తీరుతో విసిగిపోయిన ప్రియాంక అనే మహిళా నేత పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్టు చేయటం గమనార్హం.

పోలీసులు ఆరాచకంగా వ్యవహరిస్తున్నారని.. మహిళలు అన్నది కూడా చూడకుండా వేధిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రాజకీయం ఏ తీరులో ఉందన్నది ఈ ఉదంతం చెప్పేస్తుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News