అప్పుడే కోవింద్ పిలిచారు.. మోడీ వెళ్లారు

Update: 2017-07-26 08:24 GMT
ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురుచూసిన వేళ వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రు మాత్రం వెయిట్ చేయ‌గ‌ల‌రు. తాజాగా ప్ర‌ధాని మోడీ తీరు చూస్తే ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. మూడేళ్ల‌కు పైనే ఎదురుచూసిన ఉద‌యం ఆయ‌న‌కు ఈ రోజు వ‌చ్చింద‌ని చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని సొంతం చేసుకొని ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టికీ మోడీకి ఉండే ఇబ్బందులు మోడీకి ఉన్నాయి.

ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన బ‌ల‌మైన ప్ర‌ధానిగా మోడీకి ఉన్న పేరు ప్ర‌ఖ్యాతల్ని ఎవ‌రూ త‌క్కువ చేయ‌లేరు. కానీ.. ఆయ‌న‌కున్న ప‌రిమితులు ఏమిటంటే.. రాజ్య‌స‌భ‌లో మెజార్టీ లేక‌పోవ‌టం.. ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల‌కు మారు మాట్లాడ‌కుండా ర‌బ్బ‌ర్ స్టాంప్ వేసి పంపే రాష్ట్రప‌తి లేక‌పోవ‌టం. రాజ్య‌స‌భ‌లో మెజార్టీ లేని నేప‌థ్యంలో ఆర్డినెన్స్ ల‌తో కాలం  వెళ్ల‌బుచ్చుతున్న మోడీ స‌ర్కారు తీరును మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌లుమార్లు త‌ప్పు ప‌ట్ట‌టం మ‌ర్చిపోలేం.

చివ‌ర‌కు ప‌ద‌విని వీడి పోతున్న వేళ ఇచ్చిన విందులోనూ ఆయ‌న ఆర్ఢినెన్స్ జారీ చేసి పాల‌న చేయ‌టం స‌రి కాదంటూ మోడీ స‌ర్కారుకు వేయాల్సిన చుర‌క‌లు వేసి వెళ్ల‌టం మ‌ర్చిపోలేం. మొన‌గాడు లాంటి మోడీకి ఇలాంటి మాట‌లు అనిపించుకోవ‌టం ఎంత‌మాత్రం ఇష్టం ఉంటుంది. అందుకే.. త‌న‌కు న‌చ్చిన‌.. తాను చెప్పింది చెప్పిన‌ట్లుగా చేసే వారిని ఉన్న‌త స్థానంలో ఉంటే మాట‌లు ప‌డే అవ‌కాశం ఉండ‌ద‌ని భావించి  ఉండొచ్చు. అందుకే కాబోలు.. రాష్ట్రప‌తి ప‌ద‌విని చేప‌ట్టిన మ‌ర్నాడు పొద్దు పొద్దున్నే రాష్ట్రప‌తి నివాసానికి వెళ్లారు మోడీ.

రాష్ట్రప‌తి ఆహ్వానిస్తే తాను వెళ్లిన‌ట్లుగా ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేసిన‌ప్ప‌టికీ.. అస‌లు విష‌యం ఎవ‌రికి మాత్రం తెలీదంటూ బీజేపీలో మోడీ అంటే ఆగ్ర‌హం ఉన్న నేత‌లు త‌మ మ‌న‌సులోని మాట‌ను చెప్ప‌టం గ‌మ‌నార్హం. మూడేళ్ల‌కు పైనే ఎదురుచూస్తున్న వేళ వ‌చ్చిన‌ప్పుడు.. రాష్ట్రప‌తి భ‌వ‌న్ కు వెళ్లి.. త‌న‌కు స‌న్నిహితుడైన కోవింద్‌ కు ఇవ్వాల్సిన సూచ‌న‌లు.. చెప్పాల్సిన మాట‌లు చెప్ప‌కుండా ఉంటారా?
Tags:    

Similar News