నా మొదటి కారును వెతికి పెట్టండి ప్లీజ్.. అభిమానులకు సచిన్ విజ్ఞప్తి

Update: 2020-08-20 17:30 GMT
సచిన్ టెండూల్కర్.. పదహారేళ్ళ వయసు లోనే భారత క్రికెట్ లోకి వచ్చి తన బ్యాటింగ్ విన్యాసాలతో ఎన్నో అద్భుతాలు చేశాడు. క్రికెట్ దేవుడిగా మారాడు. ప్రపంచంలోనే తనకు మించిన వారు ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. వందల కోట్లకు అధిపతి అయ్యాడు. అతడి గ్యారేజ్ నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా సచిన్ ఓ  విషయంలో మాత్రం వెలితిగా ఫీల్ అవుతున్నాడు. సచిన్ క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో తన సంపాదనతో మారుతి సుజుకీ 800 కారును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దాన్ని వేరే వాళ్లకు అమ్మేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ ' ప్రస్తుతం నా కార్ల గ్యారేజీలో బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. కానీ నేను మొదట కొన్న మారుతి సుజుకీ 800 లేకపోవడంతో ఎంతో వెలితిగా ఉంది.

ఆ కారుతో  నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. కారును కొన్న కొత్తలో ఇంట్లో తెలియకుండా బయటకు షికారుకు  వెళ్లేవాడిని. అయితే ఆ తర్వాత దానిని అమ్మేశా. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ కారుంటే బాగుండేది అనిపించింది. మా ఇంటికి సమీపంలోనే ఓ సినిమా థియేటర్ ఉంది. అక్కడికి ఎవరైనా ఆ కారును  తీసుకొని వస్తారా అని.. తన ఇంటి బాల్కనీలో కూర్చుని చూసేవాడిని. వస్తే తిరిగి తీసుకోవాలని భావించా. అయితే అది ఎప్పుడు కనిపించలేదు. అది లేని లోటు నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు ఆ కారు కోసం వెతుకుతున్నా' అని సచిన్ వెల్లడించాడు. ఆ కారు గురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని సచిన్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
Tags:    

Similar News