పైలట్లు లేక ఆగిపోయిన 30 ఇండిగో విమానాలు

Update: 2019-02-11 05:00 GMT
దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ అనూహ్యంగా 30 సర్వీసులను రద్దు చేసింది. ఇందుకు కారణం పైలట్లు దొరక్కపోవడమేనని తెలుస్తోంది. హైదరాబాద్ - చెన్నై - జైపూర్ తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు కంగారు పడుతున్నారు.
   
హైదరాబాద్‌ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 6 సర్వీసులు ఆగిపోగా - చెన్నైలో 8 - జైపూర్ లో 3 సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేశారు. మరికొన్ని చోట్లా పలు సర్వీసులు రద్దు చేశారు. సిబ్బంది కొరత కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని సమాచారం. అయితే, ఇండిగో సంస్థ మాత్రం వేరే కారణం చెబుతోంది. వాతావరణం అనుకూలించక రద్దు చేసినట్లు ప్రకటించింది.
   
పైలట్లు ఏడాదికి వెయ్యి గంటలు మాత్రమే విమానాలను నడపాల్సివుంటుంది. ఇండిగో పైలట్లంతా దాన్ని అధిగమించారని తెలుస్తోంది. కాగా, పలు నగరాల్లో మంచు దట్టంగా కురుస్తూ ఉండటం - వాతావరణం అనుకూలించని కారణంగా 30 సర్వీసులు నిలిపివేశామని సంస్థ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరో 11 విమానాల దారి మళ్లించామని తెలిపింది. విమాన సర్వీసుల రద్దుతో గమ్యస్థానాలకు చేరే మార్గం లేక వేలాది మంది ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. ఇండిగో వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News