ఆ 'ముద్ర' తో పవన్ భయపడ్డాడా?

Update: 2018-11-13 07:33 GMT
ప్రజారాజ్యం పార్టీ వచ్చినపుడు మెగాస్టార్ చిరంజీవిని అందరి వాడనే అనుకున్నారంతా. కానీ తర్వాతి పరిణామాలతో ఆయన కొందరి వాడు అయిపోయారు. చాలా వరకు చిరంజీవి సామాజిక వర్గమైన కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే ప్రజారాజ్యం గెలిచింది. ఇక ఎన్నికల తర్వాత జరిగిన మరిన్ని పరిణామాలతో చిరు పూర్తిగా ఒక కాపు నేత అయిపోయాడు. తర్వాత ఏం జరిగిందన్నది తెలిసిందే. ఐతే జనసేన పార్టీ పెట్ట రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్నయ్యకు భిన్నమైన ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.

మొదట్లో ఆయన రాజకీయాలు కూడా అలాగే సాగాయి. కాపు నేతల్ని పట్టించుకోనట్లుగా కనిపించాడు. అన్ని చోట్లా విస్తరించాలని చూశాడు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లాక వాస్తవం బోధపడిందేమో. పవన్ చూస్తుండగానే మారిపోయాడు. తన సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు జనసేన పార్టీలో మెజారిటీ నాయకులు పవన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. మరోవైపు పవన్ మిగతా ప్రాంతాల్ని వదిలిపెట్టి.. తన సామాజిక వర్గం ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే తిరుగుతూ.. అక్కడే సభలు.. వివిధ కార్యక్రమాలు చేస్తుండటంతో అతడిపై కులం ముద్ర బలంగానే పడింది. ఇది రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. తనను కాపు నాయకుడిగా ఫిక్స్ చేస్తుండటంతో పవన్ అప్రమత్తం అయినట్లున్నాడు.

తాజాగా కార్తీక మాసం వన భోజనాల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల కాపు నాయకులు పవన్ బొమ్మ పెట్టి కార్యక్రమలు చేపడుతుండటం గురించి పవన్ కు ముందే సమాచారం అందింది. దీనిపై పవన్ అప్రమత్తం అయ్యాడు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేవాళ్లు తన బొమ్మ పెట్టొద్దని.. తన పేరు వాడుకోవద్దని సుతి మెత్తగా హెచ్చరిక జారీ చేశాడు పవన్. పూర్తిగా కుల నాయకుడిగా ముద్ర వేయించుకుంటే చాలా కష్టమని పవన్ భయపడినట్లుగా కనిపిస్తోంది. ఐతే పవన్ వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన ఈ ఛోటా నేతలు ఆగుతారా అన్నది ప్రశ్న.
Tags:    

Similar News