తెలంగాణలో పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

Update: 2023-01-24 15:42 GMT
తెలంగాణలోని కొండగట్టులో తన వారాహి వాహనానికి పూజ చేసి యాత్రకు సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ కలిసి వస్తే పొత్తు ఉంటుందని ప్రకటించారు.

ఇప్పటికైతే బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న పవన్.. కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ట్విస్ట్ ఇచ్చాడు.  తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ పడేనాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందని తెలిపారు.

జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజల కోసం తెలంగాణలోని కొండగట్టుకు వచ్చిన పవన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలని.. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళతామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు.

బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతించిన పవన్ కళ్యాణ్.. మార్పు ఆహ్వానించదగినదే అని అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటున్నారని.. అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని పవన్ కామెంట్ చేశారు.

ఇక ఇప్పటికే తెలంగాణ బీజేపీ తమకు రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు లేదని ప్రకటించింది. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల శ్రీకాకుళంలో గౌరవం దక్కని చోట కలిసి ఉండడం సాధ్యం కాదని ప్రకటించారు. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగానే బీజేపీతో కలిసి ఉంటామన్నారు.

దీంతో ఏపీలో పొత్తుల వ్యవహారం తేలితే తప్ప తెలంగాణలోనూ బీజేపీతో జనసేన కలిసి సాగే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఆ పార్టీ స్పందనను బట్టి ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఆ పార్టీ కోర్టులోకి నిర్ణయాన్ని నెట్టేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News