పవన్ కళ్యాణ్ మహానాడుకు ఎందుకు రాకూడదు?

Update: 2015-05-25 04:43 GMT
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో జరగబోయే టీడీపీ పండగ మహానాడుకు రావాలని అనుకుంటున్నారా? తెలుగుదేశం శ్రేణులు సైతం పవన్ వస్తే బావుంటుందని భావిస్తున్నారా? పవన్ ను ఆహ్వానించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసిందా....ఈ రకమైన అంశాలు ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో గెలుపొందడం వెనుక పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారనేది అందరికీ తెలిసిన నిజం. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు వద్దకూడా పవన్ కు ప్రత్యేకమైన వెయిట్ ఉంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మహానాడుకు పవన్ ను ఆహ్వానించాలని కొందరు టీడీపీ నేతలు పార్టీ పెద్దలకు సూచించారు. అయితే దీనికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంగీకరించనట్లు సమాచారం. పవన్ హాజరైతే మహానాడు ఉద్దేశం పక్కదారి పడుతుందని బాబు భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పవన్ కు ఆహ్వానం అందలేదు.

మరోవైపు రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ ఆర్డినెన్స్ ఇస్తే నిరసన తెలుపుతానని చెప్పిన పవన్ అందుకు తగ్గట్లు కార్యాచరణ చేపట్టలేదు. అలా చేయకపోవడం టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు, రైతులకు ఇచ్చిన భరోసా నుంచి పవన్ వెనక్కు తగ్గాడనే సంకేతాన్ని పంపించింది. ఈ నేపథ్యంలో పవన్ మహానాడుకు హాజరయితే... పూర్తిగా టీడీపీ సభ్యుడిగా మారిపోయినట్లేనని, తన ఉనికిని కోల్పోవడమే అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు పవన్ కు బహిరంగ సభలు, సమావేశాలన్నా పెద్దగా ఆసక్తిలేదనే అభిప్రాయం కూడా ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావాన్ని కూడా పవన్  తన ఆలోచనలు నచ్చే అభిమానుల మధ్య ఒక సమావేశ మందిరంలో ఏర్పాటు చేసుకోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా పవన్ మహానాడుకు వెళ్లకుండా ఉంటారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

-గరుడ
Tags:    

Similar News