ఎన్నికల వేళ జనసేనలో ఆ రెండూ బయటపడ్డాయ్!

Update: 2019-03-21 01:30 GMT
ఆల్రెడీ తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య అనైతిక పొత్తు గురించి గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పార్టీలూ అంతర్గతంగా ఒకదానికి మరోటి సహకరించుకుంటున్నాయి.. అనే ప్రచారం ఒకటి ఊపందుకుంటోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించింది లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీని పల్లెత్తు మాట అనకుండా - అధికార పార్టీ విధానాల్లోని లోటుపాట్లను ప్రస్తావించకుండా.. రాజకీయం చేయాలంటే అది కుదిరే పని కాదు.

ఫ్యాన్స్ ఉన్నారు. కుల బలం ఉంది..ఇవే చాలు అనుకుంటే - ఆ వర్గాల ఓట్లు వంద శాతం పడ్డా… అవి గెలుపుకు సరిపడే స్థాయిలో ఉండబోవనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే..జనసేనకు సంబంధించి మరో యాంగిల్ కూడా బయట పడేసింది. నాగబాబు జనసేనలోకి చేరడం - చేరుతూనే నరసాపురం ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు అన్నీ ఇన్నీ కాదు. తనకు కుల పిచ్చి లేదని… తనకు కుల సమీకరణాలతో సంబంధం లేదని - తను గెలుపు కోసం కుల సమీకరణాలు అనుకూలంగా ఉండే ప్రాంతంలో పోటీ చేసేది ఉండదని పవన్ చెప్పుకొచ్చారు.

తనుగెలిచే అవకాశం లేకపోయినా అనంతపురం జిల్లా నుంచి  పోటీ చేయబోతున్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆ మాట తప్పారు. అనంతపురం నుంచి పోటీ  చేయడం పక్కన పెట్టేసి.. కుల సమీకరణాలు పూర్తిగా అనుకూలంగా ఉండే ప్రాంతంలో పవన్ పోటీ చేస్తూ ఉన్నారు. తద్వారా.. తన అసలు రూపం చూపించేశారు జనసేన అధిపతి.

ఒకవేళ అనంతపురం నుంచినే పవన్ నామినేషన్ వేసి ఉంటే, గెలుస్తాడో గెలవడో.. కానీ సాహసం చేసిన వ్యక్తి అయ్యే వాడు. అయితే కాపుల జనాభా గట్టిగా ఉన్న చోట్ల నామినేషన్ వేసి పవన్ కల్యాణ్ తన అసలు కథను చాటి చెప్పుకున్నారు.

ఇక అన్నయ్య నాగబాబుకు టికెట్ ఖరారు  చేసేయడం కూడా అదే తీరున ఉంది. మొన్నటి వరకూ తాము జనసేనకు సపోర్టే కానీ.. తాము ఆ పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండమని..  పవన్ కల్యాణ్ కుటుంబీకులు స్పష్టం చేస్తూ వచ్చారు. అలా ఉండుంటే బాగానే ఉండేది.

 కేవలం తమ్ముడి ప్రచారం కోసం నాగబాబు రంగంలోకి దిగి పని చేసి ఉంటే అది బాగుండేది. అయితే ఇప్పుడు టికెట్ కూడా ఖరారు చేయడం అది కూడా మళ్లీ అటు వైపే వెళ్లడం.. మాత్రం జనసేనలోని బంధుప్రీతి బయటపడింది. ఇతర పార్టీల్లో బంధు ప్రీతి లేదు అని కాదు. అయితే పవన్ మాత్రం తనకు కులాభిమానం - బంధుప్రీతి రెండూ లేవని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల సమయంలో అవే హైలెట్ అవుతూ ఉండటం విశేషం.
Tags:    

Similar News