పవన్ 'విధేయ పక్షపాతి' కాకూడదు!

Update: 2018-02-18 04:31 GMT
సాధారణంగా రాజకీయ నాయకుల్లో చాలా వరకు ఆశ్రిత పక్షపాతి అయి ఉంటారు. అంటే ఎవరు వచ్చి ముందుగా తమను ఆశ్రయిస్తే.. అంటే ఎవరు వచ్చి ముందుగా తమ సాయాన్ని అర్థిస్తే వారికి మంచి చేయాలని అనుకుంటారు. వారికి ఇక యుక్తా యుక్త విచక్షణ గానీ, మంచి చెడు గానీ ఉండనే ఉండవు. అవతలి వారిది న్యాయం అయినా సరే.. తనను ఆశ్రయించిన వారికి మాత్రమే మంచి జరగాలని వారు భావిస్తారు. అలాంటి వారిని ఆశ్రిత పక్షపాతి అంటారు. అలా మొండిగా తమను ఆశ్రయించిన వారికి న్యాయం చేసేస్తుంటారు గనుకనే.. నాయకులు వర్గాలను డెవలప్ చేసుకోగలుగుతుంటారు.

ఆ తరహాలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘‘విధేయ పక్షపాతి’’ కాకుండా.. తర్కబద్ధంగా వ్యవహారాలను పరిశీలించి, నిజానిజాలను బేరీజు వేసి... తప్పు ఎక్కడ జరుగుతున్నదో గ్రహించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.  ఎవరు ఆయన పట్ల విధేయత చూపిస్తే.. వారే కరెక్టు అనుకోవడం, ఎవరు విధేయత చూపించకుండా పొగరుగా వ్యవహరిస్తే వారిది తప్పు అనుకోవడం చేయరాదని ప్రజలు భావిస్తున్నారు.

పవన్ సారథ్యంలో అధ్యయనం చేస్తున్న కమిటీ గురించి ‘తమపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని’ జేపీ ముందుగానే ప్రకటించినప్పటికీ.. ప్రజలకు మాత్రం చాలా ఆశలే ఉన్నాయి. ఎందుకంటే ఆ కమిటీలో ఉన్నవాళ్లంతా మామూలు వ్యక్తులు కాదు. ఉద్ధండులు. అపారమైన వ్యవహారజ్ఞానం ఉన్నవారు. ఇలాంటి వారి అధ్యయనంలో నిజాలు నిగ్గుతేలుతాయనే ప్రజలు ఎదురచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కొన్ని వివరాలు అడగడం జరిగింది.

తొలుత వివరాలు ఇవ్వం- వెబ్ సైట్లో చూసుకోండి అంటూ మంత్రులు తలెగరేసినప్పటికీ, ‘పవన్ మనవాడే’ అనే తన భరోసాను మంత్రులకు కూడా తెలియజెప్పిన తర్వాత.. ఏపీ సర్కారు - పవన్ కమిటీ అడిగే వివరాలు అందించడానికి ఇద్దరు ఐఎఎస్  అధికార్లను నియమించింది. 118 పేజీల నివేదికను కూడా కమిటీకి పంపించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకోలేదు. పవన్ వినతిని ఖాతరు చేయలేదు.

ఇక్కడే ప్రజలకు అనుమానాలు రేగుతున్నాయి. తాను అడిగినందుకు తగిన మర్యాద ఇచ్చి ప్రత్యేకంగా మనిషిని పెట్టి  చంద్రబాబు నాయుడు నోట్ పంపినందుకు, ఆ రకంగా తన పట్ల విధేయత ప్రదర్శించినందుకు  మురిసిపోయి బాబు చేస్తున్నదంతా రైటు అని - తను అడిగినా కూడా పట్టించుకోకుండా అహంకారం చూపిస్తున్నందుకు కేంద్రం చేస్తున్నదంతా తప్పు అని అనుకోకుండా.. పవన్ కమిటీ నిజాలను నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News