టాలెంట్ తో పోటీ పడు...లక్ తో పెట్టుకోకు !

మానవ జీవితంలో అందరూ నిన్నటి కంటే నేడు పైకి రావాలని చూస్తారు. జీవితం అంటే అదే మరి. అభివృద్ధి లేని బతుకు వ్యర్థమే.;

Update: 2025-12-07 17:30 GMT

మానవ జీవితంలో అందరూ నిన్నటి కంటే నేడు పైకి రావాలని చూస్తారు. జీవితం అంటే అదే మరి. అభివృద్ధి లేని బతుకు వ్యర్థమే. అయితే లైఫ్ లో ఎదిగేందుకు ఎవరైనా ఎంతో ప్రయత్నం చేస్తారు. తమ కష్టం అంతా పెడతారు, తమ ప్రతిభనే ఫణంగా చేసి మరీ డే అండ్ నైట్ పరిశ్రమిస్తారు. కానీ అలా కష్టపడిన అందరికీ జీవితం పూలపానుపు పరుస్తోందా అంటే నో అని గట్టిగా చెప్పాల్సిందే. కష్టపడితే ఫలితం ఉంటుంది అన్నది ఓకే కానీ అంతకు మించి కూడా ఒకటి ఉంది అని నమ్మాలి. దాని పేరే లక్. చాలా మంది అంటూంటారు నక్కను తొక్కి వచ్చాడు అని. నక్క తోక తొక్కితే లక్ తగులుతుందని నమ్ముతారు. అలా చుట్టూ ఉన్న అనేక మంది జీవితాలను చూస్తే కనుక వారు ప్రస్తుతం ఉన్న స్థానాలకు కష్టంతో పాటు లక్ కూడా చాలానే ఫేవర్ చేసింది అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

టాలెంట్ వరకూ ఓకే :

ఇక టాలెంట్ ఉన్న వారు కూడా చాలా మంది కనిపిస్తూంటారు. అయితే వారు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతూంటారు. దానికి కారణం లక్ వారికి దూరంగా ఉండడమే. అలాగే తక్కువ టాలెంట్ తో కూడా కొంతమంది టాప్ చెయిర్ ని అందుకుంటారు. దానికి రీజన్ ఒక్కటే అదృష్టం ముందే పుట్టి వారు పుట్టడమే. ఈ మాట అంటే మూఢత్వంతో ఉన్నారని అనుకోవచ్చు. కానీ చాలా మంది లైఫ్ ని తరచి చూస్తే వారికి ఏమి తక్కువగా కానీ ఎదగలేకపోతున్నారు అని అంటూంటారు. అసలైన రీజన్ లక్ లేకపోవడమే అని చెప్పాల్సి ఉంటుంది.

అసూయ పడకంతే :

టాలెంట్ ఫలానా వారి దగ్గర ఉంది. లేదా వారు బాగా కష్ట పడుతున్నారు అని అనుకుంటే ఈ రెండింటి విషయంలో ఎంతో కొంత శ్రమ చేసి సాధించవచ్చు. కానీ వారి వద్ద అదృష్టం ఉంటే ఎలా పోటీ పడతారు, అది శ్రమతో వచ్చేది కాదు వేరే విధంగానూ చిక్కేది కాదు, అది వారికి ప్రాప్తించిన యోగంగానే చూడాలి. అందుకే అదృష్టవంతుడిని చూసి ఈర్ష్య అసూయలు పడినా కూడా సాధించేది ఏమీ ఉండదు, నచ్చితే వారిని చూసి ఆనందించు, లేదా సైలెంట్ అయిపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు, ఎందుకంటే అదృష్టవంతుడిని ఎవరూ కూడా చెడిపేది ఉండదు కాబట్టి.

అది మాత్రం తప్పు :

ఇక అదృష్టమే అన్నీ తేల్చేస్తుంది, మన వంతు చేయాల్సింది ఏమీ లేదు అనుకోవడం కూడా తప్పు. మన వంతుగా ప్రయత్నం చేయాలి. ఆ మీదట లక్ ఫేవర్ అయిందో లేదో ఆలోచించాలి. అంతే తప్ప కేవలం లక్ ని నమ్ముకుని జాక్ పాట్ కొట్టాలి అనుకుంటే మాత్రం జీవితంలో అలాంటి వారు అంత ఫెయిల్యూర్ మనిషి ఉండరు అని చెప్పాల్సిందే. ఇక కష్టపడిన వారికి ఫలితం దక్కదా అంటే కచ్చితంగా దక్కుతుంది. కానీ ఒక్కో మెట్టూ ఎక్కి వచ్చిన వారికీ ఒకేసారి నిచ్చెన వేసుకుని ఎగబడిన వారికి ఉన్నంత తేడా లక్ కి కష్టపడడానికి మధ్య ఉంటుంది. అదృష్టం లేకపోతే అతను కానీ ఆమె కానీ ఈ పొజిషన్ లో ఉండేవారు కాదని అనుకోవడం వారి మీద పడి ఏడవడం బాధపడడం వల్ల సుఖం కూడా లేదు.

వారు ధన్యులే అనుకోండి :

ఎందుకంటే దాని వల్ల నీవు వారి లక్ ని ఏ చిన్న పాటి కూడా కదల్చ లేవు, నీవు ఇంకా ఏడుస్తూండగానే వారు ఇంకా పైకి ఎగబాకి మంచి పొజిషన్లకు వెళ్ళిపోతారు. అందుకే ఎపుడూ ప్రతిభను కష్టాన్ని మాత్రం నమ్ముకుని ముందుకు వెళ్ళిన వారు లక్ గురించి ఆలోచించరు. అది అదనంగా సమకూరే ఇంధనమే తప్ప మరేమీ కాదని వారి భావన. అసలు ఏమీ లేకపోయిన వారు కూడా లక్ తో మన పక్క సీట్లో కూర్చున్నారు అనుకోండి. వారిని చూసి కూడా బాధపడితే ఒరిగేది ఏమీ ఉండదు, హాయ్ అంటూ అందంగా పలకరించండి. ఆ లక్ ని కూడా గౌరవించండి. లక్ ఊరకే రాదు, దానికి కూడా ఒక యోగం ఉండాలి. అది వారికి మీ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వారు ధన్యులే అనుకోండి. సో మొత్తానికి చెప్పేది ఏంటి అంటే లక్ ని తొక్కాలని వెతుకుతూ బతుకంతా వేస్ట్ చేసుకోవద్దని. అలాగే లక్ ని పట్టిన వారిని చూసి జెలస్ ఫీల్ కావద్దు అని. మీ కష్టం మీ టాలెంట్ తో ముందుకు పోవడమే ఎపుడూ బెటర్. ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ తక్కువ కాదు అన్నది కనుక ఎప్పటికప్పుడు మననం చేసుకుంటే అదే లైఫ్ కి అతి పెద్ద రిలీఫ్. సో అలాగే ముందుకు సాగాల్సిందే ఎవరైనా ఎందాకైనా.

Tags:    

Similar News