ఆ మాత్రం ఆత్మ వంచన లేకపోతే బ్రతకడం కష్టం

Update: 2016-08-31 14:25 GMT
తుడిచేసుకుంటే పోతుందనుకుంటే.. తుడిచేసుకుని పోయే రకానికి చెందిన వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. రాజకీయాల్లో షైన్ కావడానికి ఒకింత ఆత్మవంచన కూడా అవసరం. ఇప్పుడు భాజపా నాయకులు ఆ విషయాన్నే నిరూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ తిరుపతిలో సభ పెట్టి భాజపా పార్టీని - మోదీని - కేంద్రప్రభుత్వాన్ని .. మాట తప్పుతున్న వారి వంకర బుద్ధుల్ని - పేర్లుపెట్టి మరీ వెంకయ్యనాయుడు - జైట్లీలను ఉతికి ఆరేస్తే.. అబ్బే మమ్మల్నేమీ అన్లేదు. అంటూ.. కేంద్రమంత్రి - ఆంధ్రప్రదేశ్ రాష్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థ నాధ సింగ్ ఆత్మవంచన చేసుకోవడం జనానికి నవ్వు తెప్పిస్తోంది. పవన్ తిట్లను భరించి మళ్లీ ఆయనతో స్నేహం కోరుకోవాలంటే.. ఆమాత్రం తప్పదని, ఎక్కడికక్కడ తిట్లను మరిచిపోయే సుగుణం ఉండాల్సిందేనని జనం అనుకుంటున్నారు.

 ప్రత్యేక హోదా విషయం మై పవన్ కల్యాణ్ తిరుపతి సభ అన్ని పార్టీల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రతి పార్టీ కూడా వారికి తోచినట్టు గా  వారు స్పందించారు. బిజెపి పార్టీకి ఎలా స్పందించాలో బహుశా అర్ధం కానట్టుంది. ఏపి బిజెపి ఇన్ ఛార్జ్ సిద్దార్ధనాధ సింగ్ 'బిజెపి గురించి పవన్ కల్యాణ్ ఎటువంటి విమర్శ చేయలేదు' అనే ఇచ్చిన స్టేట్ మెంట్  చూసి జనాలు నవ్వుకుంటున్నారు. 2014 లో సోనియా గాంధి రాష్ట్రాన్ని విడగొట్టడానికి నిర్ణయం తీసుకున్నారు, ఈ విషయంలో బీజేపీ ఏమీ తక్కువ తినలేదు -  అంత కన్నా ముందే కాకినాడ లో బిజెపి రాష్ట్రాన్ని విడగొట్టాలనే దుష్ట చర్యకు పాల్పడింది అని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శిస్తే మరి సింగ్ గారికి అర్ధం కాలేదేమో! మేము సౌత్ లో వున్నామ అంటే కింద వున్నామని చిన్నచూపా లేక మీ చూపులు ఎప్పుడూ పైనేనా అని ప్రధాని మోది ని సూటిగా ప్రశ్నించి నిప్పులు చెరిగితే   అది మమ్మలి కాదులే అని అనుకోవడం వింతగా వుందని ప్రజలు అనుకుంటున్నారు.

ఆయనకి తెలుగు భాష రాదేమోనని అందుకే పవన్ మాటల భావన అర్ధం కాలేదేమోనని కొందరు జోకులేసుకుంటున్నారు. ఆఖర్లో ఢిల్లీ పెద్దలకు తెలుగు అర్ధం కాదని హిందిలో కూడా సూటిగా ప్రశ్నించలేదా? మరి  దిల్లీ లో వున్న పెద్దలు బిజేపి వాళ్ళు కాదా? వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా గురించి చెప్పండయ్యా అంటే పాడిందే పాట... అన్న సామెత లాగ ప్రత్యేక హోదా వలన వచ్చే అన్ని రకాల ప్రయోజనాలు తీర్చడానికి కేంద్రం రెడీగా వుందని సెలవిస్తారు ఏపి బిజేపి ఇన్ ఛార్జ్ సింగ్ గారు. దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే ఆయనకి  తిరుపతి సభలో పవన్ కల్యాణ్ ఏం చెప్పాడో అర్ధం కాలేదు లేదా ఆ మాత్రం ఆత్మ వంచన చేసుకోపోతే కష్టమని భావించి వుండాలని ప్రజల అభిప్రాయం.
Tags:    

Similar News