ఏపీ ముఖ్యమంత్రికి 'బటన్ ఛాలెంజ్' విసిరిన పవన్

Update: 2023-07-11 08:27 GMT
వారాహి విజయయాత్ర పేరు తో గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన మాటల తో ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయటం తెలిసిందే. తన తొలి వారాహి విజయయాత్ర సందర్భంలో  సంచలన వ్యాఖ్యలు చేయటంతో పాటు.. తన ప్రసంగాల్లో ప్రభుత్వానికి టార్గెట్లు పెట్టటం తెలిసిందే. జూన్ 25న మలికిపురం లో నిర్వహించిన సభ లో వైసీపీ ప్రభుత్వానికి ఒక రోడ్డు విషయం లో అల్టిమేటం జారీ చేశారు.

రాజోలు ఎల్ ఐసీ బైపాస్ రోడ్డుకు 15 రోజుల వ్యవధి లో మరమ్మత్తులు చేయాలని.. ఒకవేళ చేయకుంటే తానే ముందుండి శ్రమదానం చేసి రోడ్డు వేయిస్తానని పేర్కొన్నారు. అనూహ్యంగా పవన్ వ్యాఖ్యల అనంతరం రోడ్డు మరమ్మత్తుల కోసం నిధులు జారీ కావటంతో పాటు.. పనులు మొదలయ్యాయి. దీంతో.. ఈ రోడ్డు జనసేనా ని క్రెడిట్ అంటూ జనసైనికులు పెద్ద ఎత్తున  ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వారాహి విజయయాత్ర 2లో భాగంగా వైసీపీ ప్రభుత్వానికి మరో సవాలు విసిరారు పవన్ కల్యాణ్.

ఏలూరు ప్రభుత్వ కాలేజీ దుస్థితి కళ్లకు కట్టేలా పలు ఫోటోల్ని సోషల్ మీడియా లో షేర్ చేసిన పవన్.. 'చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెల కు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరం లో ఉన్న ప్రభుత్వ కాలేజీకి వెళితే చాలు. పథకాల కు పేర్లు పెట్టుకోవటం మీద ఉన్న శ్రద్ధ కాలేజీ భవనాల్ని నిర్మించటం పై పెట్టాలి. 300 మంది చదువుకుంటున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్' అంటూ సవాలు విసిరారు. ఈ సందర్భంగా కాలేజీ దుస్థితిని తెలియజేసేలా పలు ఫోటోల్ని షేర్ చేశారు. రోడ్డు విషయం లో రియాక్టు అయిన వైసీపీ సర్కారు.. ఏలూరు కాలేజీ విషయం లో ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Similar News