అమ్మ దొంగా! పన్నీర్ సెల్వం

Update: 2016-03-15 10:18 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే టిక్కెట్ల కు బేరం పెట్టిన ఆరోపణలతో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అమ్మ అనుంగు అనుచరుడు - మాజీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం సన్నిహితుడు కూడా ఉండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు... అమ్మంటే అమితమైన భక్తి చూపించే సెల్వం వెనుకాల గోతులు తవ్వుతున్నట్లుగా కూడా ఆధారాలు లభిస్తున్నాయి. నిందితులంతా గతంలో జయలలిత నివాసంలో పనిచేసిన వారేనని తెలిసింది. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన తన నెచ్చెలి శశికళను పార్టీ అధినేత్రి జయలలిత గత కొంతకాలంగా దూరంగా పెట్టారు. ఈ నేపథ్యంలో శశికళ వర్గంవారు అరెస్ట్ అయ్యారు. పార్టీ వ్యవహారాల పరంగా శశికళ స్థానాన్ని మంత్రి పన్నీర్‌ సెల్వం భర్తీ చేశారు. పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో ఐదుగురితో కూడిన ఒక క్రమశిక్షణ కమిటీని జయ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆరోపణలు వచ్చిన వారిపై ఈ ఐదుగురు విచారణ జరిపి జయలలితకు నివేదికను సమర్పిస్తారు, కాగా, విచారణ తీరు, నివేదికను అందజేయడంలో ఈ కమిటీ ఆశ్రీత పక్షపాతానికి పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. కాగా, పన్నీర్‌ సెల్వం.. పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా జయ దృష్టికి వచ్చిందని చెబుతారు. దీంతో పన్నీర్‌ సెల్వం - నత్తం విశ్వనాథన్ - పళనియప్పన్‌ లను పార్టీ క్రియాశీలక బాధ్యతల నుంచి జయలలిత తప్పించారు. మంత్రులు ఎడప్పాడి పళనిస్వామి - వైద్యలింగం - తంగమణి - వేలుమణిలతో ఏర్పడిన ఈ కమిటీనే పార్టీలో సీట్ల పంపకాలు, పొత్తులపై చర్చలు జరిపే బాధ్యతలకు నియమించారు. ఈ క్రమంలో మంత్రి పన్నీర్‌ సెల్వం స్నేహితుడు అరెస్ట్ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి పన్నీర్ సెల్వం స్నేహితుడు సినీ మహమ్మద్ మరికొందరు కలిసి చెన్నై శివార్లు నీలాంగరైలో ఒక బంగ్లా అద్దెకు తీసుకుని అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పిస్తామని కోట్లాది రూపాయల బేరసారాలు సాగిస్తున్నట్లు సీఎం జయలలితకు సమాచారం అందింది. ఆమె సూచనలతో పోలీసులు - నిఘా అధికారులు నీలాంగరైలోని బంగ్లాపై సోమవారం ఉదయం ఆకస్మిక దాడి చేశారు. ఆ సమయంలో మంత్రి పన్నీర్ సెల్వం కుడిభుజంగా పేరొందిన సినీ మహమ్మద్ - పోయెస్‌ గార్డెన్‌ లో గతంలో పనిచేసిన ఉద్యోగి రమేష్ - శివకుమార్ పట్టుబడ్డారు. విచారణలో సీట్లపై బేరసారాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి పన్నీర్‌ సెల్వం - శశికళ భర్త నటరాజన్ సోదరుడు - ఓ రిటైర్డు పోలీసు అధికారి మరికొందరు ఉన్నట్లు సమాచారం. కాగా, పట్టుబడిన ముగ్గురూ తమకేమీ తెలియదని పనులు చేసిపెడితే జీతం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉందన్న ఆరోపణలపైనే దక్షిణ చెన్నై పార్టీ కార్యదర్శి ఎంఎం బాబు - విజయభాస్కర్‌ లపై జయలలిత వేటువేసింది. మరో పదిమంది జిల్లా కార్యదర్శులపై వేటుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News