తమిళనాడు స్పీకర్ సుద్దపూస..?

Update: 2017-02-19 06:54 GMT
తమిళనాట రాజకీయాలు ఎంత కరకుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చర్యకు ప్రతి చర్య చాలా తీవ్రంగా ఉండటమే కాదు.. ఏళ్లకు ఏళ్లు గడిచినా వారి ఆగ్రహావేశాలు తగ్గవంటే తగ్గవు. బలనిరూపణ పరీక్ష సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. సభలో రచ్చ చేసిన డీఎంకే సభ్యులపై స్పీకర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిన్నటి రోజున ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఆచితూచి అడుగులు వేసే కన్నా.. కాస్తంత కరకుగానే వ్యవహరించారని చెప్పాలి. ఈ మాటలకు కొద్దిమంది అస్సలు ఒప్పుకోరు. సభలో అంత రచ్చ చేస్తే ఆ మాత్రం చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి.. స్పీకర్ కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే.. సభలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకునేవా? అన్నది ప్రశ్న.

డీఎంకే సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రహస్య ఓటింగ్ కు ఒప్పుకోనప్పుడు మాత్రమే. కొంతమంది ఎమ్మెల్యేల్ని అక్రమంగా రిసార్ట్స్ లో ఉంచారని.. వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన వేళ.. అసలుసిసలు బలపరీక్ష అంటే.. రహస్య ఓటింగ్ ను పెట్టటమే. నిజంగా ఆ నిర్ణయాన్ని కానీ స్పీకర్ తీసుకొని ఉంటే.. ఎవరుమాత్రం అభ్యంతరం పెట్టే వాళ్లున్నారన్న ప్రశ్న ఉంది. కానీ.. రహస్య ఓటింగ్ కు అనుమతి ఇవ్వకుండా.. తనకున్న విచక్షణాధికారం అన్న రక్షణ కవచాన్ని అడ్డు పెట్టుకొని డివిజన్ పేరిట కౌంటింగ్ కు ఓకే చెప్పి రచ్చకు స్పీకర్ కారణమయ్యారనే చెప్పాలి. ఇప్పుడీ మాటను చాలామంది ఒప్పుకోరు.

కానీ.. తర్కంగా చూస్తే.. గొడవ చేయటం ఎంత తప్పో.. గొడవ చేయటానికి కారణం కావటం కూడా అంతే తప్పు అన్నవిషయాన్ని మర్చిపోకూడదు. ఎమ్మెల్యేలు బెదిరింపులకు గురి అయ్యారన్న ఆరోపణ బలంగా వినిపించినప్పుడు.. ఎవరికి నచ్చినట్లుగా ఓటు వేసే అవకాశాన్నిఇవ్వాల్సి ఉంది.కానీ.. అదేమీ చేయని స్పీకర్ ధన్ పాల్ ను సమర్ధించటం సమంజసమేనా? ఆయన్ను సుద్దపూస కింద చూద్దామా..? ఒకవేళ అలాంటిదే అయితే.. తన మీద జరిగిన దాడి.. దళిత సమాజం మీద జరిగిన దాడిగా ఆయన అభివర్ణించటాన్ని చూడాలి. దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయితే.. ఇలాంటి మాటలుచెప్పేసే వీలుంటుందా? అన్నది అసలుసిసలు ప్రశ్న. ఇలాంటి వాటిపై ప్రజలు మరింత సీరియస్ గా థింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News