ముంపు, హైకోర్టు.. మంత్రి అనిల్ కు నిరసన

Update: 2019-11-08 10:10 GMT
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. రెండు సార్లు ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన మంత్రి అనిల్ కుమార్ ఆ జిల్లాలో తొలిసారి పర్యటించారు. ముందుగా అయ్యప్ప స్వామి మాల ధరించడంతో మంత్రి అనిల్ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. శ్రీశైలం డ్యామ్ భద్రత, సాంకేతిక అంశాలు, ముంపు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీశైలం నుంచి కర్నూలు కు బయలు దేరిన మంత్రి అనిల్ కాన్వాయ్ ను మార్గ మధ్యలోని నందికొట్కూర్ వద్ద శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు అమలు చేయలేదని.. నెరవేర్చాలని కోరారు. పెద్ద సంఖ్యలో ముంపు బాధితులు రావడంతో మంత్రి అనిల్ కారు దిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ముంపు బాధితుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.
Read more!

ఇక ఆ తర్వాత కర్నూలు లో జిల్లా అధికారులతో సమీక్ష సందర్భంగా కూడా మంత్రి అనిల్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. న్యాయవాదులు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు లోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు నినాదాలు చేశారు. వారి వద్దకు చేరుకున్న మంత్రి అనిల్.. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్పడంతో న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ నేతలు శాంతించి ఆందోళన విరమించారు.
Tags:    

Similar News