మెట్రో నగరాల్లో కొవిడ్ పుట్ట పగులుతోంది.. జర జాగ్రత్త!

Update: 2021-12-31 04:30 GMT
కొవిడ్ మూడో వేవ్ మొదలైనట్లేనని తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారి గడల శ్రీనివాస్ ప్రకటించటం తెలిసిందే. సంక్రాంతి నాటికి మూడో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే.. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే అలాంటి పరిస్థితి వచ్చేసినట్లుగా చెప్పాలి. ఈ మాటకు తాజాగా విడుదలైన నివేదికలు బలం చేకూర్చేలా మారాయి. ఓవైపు కొవిడ్ కేసులు.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 22 రాష్ట్రాలకు వ్యాపించటం.. మొత్తంగా కొవిడ్ పుట్ట మరోసారి పగిలిందని చెప్పక తప్పదు. అయితే.. ఇప్పటికి దీని తీవ్రత మొత్తం మెట్రో నగరాల్లోనే ఉంది.

కొవిడ్ తీవ్రతను గుర్తించేందుకు అనుసరించే విధానాల్లో రీ ప్రొడక్షన్ రేట్ (కొవిడ్ ఆర్ వాల్యూ) 2 దాటినట్లుగా తాజాగా చేసిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మెట్రోనగరాల్లోని కొన్నింటితో ఈ విలువ ఎక్కువ కావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ ఇన్ ఫెక్షన్ ను ఆర్ ఫ్యాక్టర్ తో అంచనా వేస్తారు. దీని విలువ 1గా ఉండే వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుందన్న లెక్క వేస్తారు. ఒకవేళ దీని విలువ 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లుగా చెబుతారు. దేశంలో కొవిడ్ తీవ్రత ఎంత ఉందన్న అంశాన్ని చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ సంస్థ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.

తాజాగా దేశంలోని మెట్రో నగరాలైన ముంబయి.. ఢిల్లీలలో ఇప్పుడు ఆర్ ఫ్యాక్టర్ వాల్యూ 2 దాటినట్లుగా గుర్తించారు. అది కూడా ఎంత వేగంగా అంటే.. కేవలం వారం వ్యవధిలోనే ఇంత మార్పు చోటు చేసుకుందని చెబుతున్నారు. డిసెంబరు 23 - 29 తేదీల్లో ఢిల్లీలో ఆర్ వాల్యూ 2.54గా ఉంటే.. ముంబయిలో 2.01గా నమోదైంది. అదే సమయంలో దేశంలోని ఇతర నగరాల్లో దీని విలువ ఎంతన్నది చూస్తే..
ఫుణె 1.11
బెంగళూరు 1.11
కోల్ కతా 1.13

చెన్నై 1.26 గా లెక్క కట్టారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అక్టోబరు రెండో వారంలో ఈ నగరాల్లో ఆర్ వాల్యూ ఒకటి కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఢిల్లీ..ముంబయి నగరాల్లో ఆర్ వాల్యూ 2 దాటటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో డిసెంబరు 20న కేవలం 91 కేసులు నమోదు అయితే.. బుధవారం (డిసెంబరు 30న) ఒక్కరోజులోనే ఈ సంఖ్య 923కు పెరిగింది. అదే రీతిలో ముంబయిలోనూ అలాంటి పరిస్థితే ఉంది.

బుధవారం ఒక్కరోజులోనే దేశ ఆర్థిక రాజధాని (ముంబయి) లో 2500 కేసులు నమోదయ్యాయి. ఇక.. గురువారం మరింతగా కేసులు పెరిగి 3671 కేసులు నమోదయ్యాయి. ఇదే ముంబయిలో డిసెంబరు 20న కేవలం 283 కేసులు మాత్రమే నమోదు కావటం చూస్తుంటే.. కేవలం పది రోజుల వ్యవధిలో కొవిడ్ తీవ్రత ఎంతలా పెరిగిందన్న విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సో.. మూడో వేవ్ ముంచుకొచ్చిన వేళలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News