తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మహిళా ఎమ్మెల్యేను చూసి ఉండరు

Update: 2023-06-08 10:01 GMT
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల లెక్క వేరుగా ఉంటుంది. ఆడంబరం భారీగా ఉండటంతోపాటు.. చేతిలోని అధికారాన్ని ప్రదర్శించాలన్న దర్పం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లోకి రాక ముందు.. ప్రజాప్రతినిధిగా వ్యవహరించటానికి ముందు ఎలాంటి లైఫ్ స్టైల్ కు భిన్నంగా వారు మారిపోవటం కనిపిస్తూ ఉంటుంది. ఒక ఊరి సర్పంచ్ లోనే ఇలాంటి మార్పు కనిపిస్తే.. ఒక ఎమ్మెల్యేగా మారిన తర్వాత సదరు మహిళా నేత మొత్తంగా మారిపోవటం కనిపిస్తుంది.

ఎమ్మెల్యే అన్న తర్వాత హంగు.. ఆర్భాటం లేకపోతే ఏం బాగుంటుందన్నట్లుగా ఉంటుంది. కానీ.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో మంత్రుల్ని సైతం ఇట్టే కలుసుకోవచ్చు. వారిని కలిసేందుకు పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి. మన దగ్గర మహిళా ప్రజాప్రతినిధుల్ని చూసిన వేళ.. ఇప్పుడు మేం చెప్పే ఉదంతం గురించి విన్నంతనే ఆశ్చర్యంతో అవాక్కు కావటం ఖాయం.

ఒడిశాకు చెందిన మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరు పద్మిని దియాన్. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నప్పటికీ.. గతంలో ఆమె మంత్రిగా పని చేశారు కూడా. కోరాపుట్ జిల్లా కాట్పాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆమె.. ఇతర వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోపని చేస్తున్న వైనం చూస్తే.. నోటి వెంట మాట ఆగిపోవటం ఖాయం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన తాను ఎమ్మెల్యే అయినప్పటికీ తన మూలాల్ని ఎందుకు మర్చిపోవాలని ప్రశ్నిస్తారు.

తాజాగా ఆమె తన పొలంలో పనులు చేసుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏటా తన పొలంలో ఇతర కార్మికులతో పాటు కోతల్లో పాల్గొనటంతో పాటు చెరువులో చేపలు కూడా పడతానని చెప్పుకొచ్చారు. ఇదేదో మీడియాలో ఫోటోల కోసం అన్నట్లు కాకుండా.. సీరియస్ గానే పొలంలో దిగి పని చేసుకుంటున్న ఆమెను చూసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోని వారు ఇలానే ఎందుకు ఉండకూడదన్న భావన కలుగక మానదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన సీతక్క సైతం ఇదే తరహాలో ఉంటారన్న విషయం తెలిసిందే.

Similar News

More