ఎన్టీఆర్ కు చంద్రబాబుకు అదీ తేడా

Update: 2016-09-27 22:30 GMT
    ఏపీలో రూ.5 కోట్లు లంచం అడిగిన ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ ఎమ్మెల్యే కంటే కనీసం ఆయన్ను వివరణ కూడా అడగని టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారం విమర్శకులను విస్తుపోయేలా చేస్తోంది. అయిదు కోట్లు లంచమడిగిన ఎమ్మెల్యే గురించి పార్టీ అధినేత ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే... అదే పార్టీ అధినేత ప్రభుత్వాధినేతగా ఉన్న రాష్ట్రంలో అధికారులు కూడా ఎంతగా లంచాలు తీసుకున్నా అడిగేవారుండరన్న సంకేతం పంపినట్లు అవుతోంది.
   
సాధారణంగా ఒక ఎమ్మెల్యే రూ. 5కోట్లు డిమాండ్ చేస్తూ దొరికితే దేశంలోనే అదో పెద్ద సంచలనం కావాలి. సదరుపార్టీ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడాలి. అవినీతి కొత్త కాకపోయినా దాన్ని బయటకు లాగిన సందర్భాలు తక్కువ కాబట్టి బయటపడితే సిగ్గుపడతారు.  కానీ నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌ ను 5కోట్లు డిమాండ్ చేస్తున్న ఆడియో టేపులు బయటకు వచ్చినా మీడియాలో అది హైలైట్ కాలేదు.  ఒకటి రెండు టీవీ ఛానళ్లు మినహాయిస్తే మరే మీడియా సంస్థ కూడా టీడీపీ ఎమ్మెల్యే డబ్బుల వ్యవహారాన్ని ప్రసారం చేయలేదు. అదే ఎవరైనా అధికారి వెయ్యి రూపాయలు తీసుకుని దొరికితే వారం రోజులు ప్రసారం చేసే ఛానళ్లు కూడా రామకృష్ణ అడిగిన 5 కోట్లను 5 రూపాయలుగా భావించి క్షమించేశాయి.
   
ఇదంతా ఒక ఎత్తయితే అవినీతి లేని పాలన అని చెప్పుకొనే చంద్రబాబు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ గతంలో అవినీతి విషయంలో ఎలా స్పందించారన్నది చాలామంది గుర్తు చేస్తున్నారు. గతంలో పది వేలు లంచం తీసుకోబోయారన్న ఆరోపణలపైనే ఏకంగా ఒక మంత్రిని బర్తరఫ్ చేసిన ఘనత ఎన్టీఆర్‌ కు ఉంది. కానీ చంద్రబాబు ఇప్పుడు 5 కోట్లు అడిగిన ఎమ్మెల్యే ను మందలించడం కానీ, కనీసం సంజాయిషీ అడగకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News