40% జీఎస్టీ.. ఏ సిగరెట్ రేటులో ఎంత పెరుగుదలంటే..!

ఈ స్థాయిలో పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచడాన్ని.. వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు.;

Update: 2026-02-01 06:54 GMT

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ లో పొగాకు ఉత్పత్తులు వాడేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇందులో భాగంగా సుమారు 27.5 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నట్లు చెబుతారు. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా భారత్ లో పొగాకు పరిశ్రమ అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా ఉంది. ఈ సమయంలో గత ఏడాది సెప్టెంబర్ లో న్యూఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది! దీంతో... నేటి నుంచి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 40% అయ్యింది!

అవును... పొగాకు ఉత్పత్తులపై కేంద్రం విధించిన 40% జీఎస్టీ నేటి (ఫిబ్రవరి 1 - 2026) నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, జాతీయ విపత్తు కంటిజెంట్ డ్యూటీ (ఎన్.సీ.సీ.డీ) కూడా విధించడంతో సిగరెట్లతో పాటు పాన్ మసాలా, గుట్కా మొదలైన పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. వాస్తవానికి ఇప్పటికే పొగాకు సంబంధిత ఉత్పత్తుల అమ్మకం ద్వారా చాలా ఆదాయం వస్తుందని అంటారు. ఈ క్రమంలో తాజా నిర్ణయంతో అది మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి పొగాకు సంబంధిత ఉత్పత్తులన్నింటిపైనా కనీసం 75% పన్ను భారం విధించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ.హెచ్.ఓ) సిఫార్సు ఉండగా.. తాజా సుంకాలు అంతకంటే చాలా తక్కువ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పన్ను రేటులను భారత ప్రభుత్వం రెగ్యులర్ గా పెంచుతూనే ఉంటుంది! ఇందులో భాగంగానే 2023 బడ్జెట్ లో ఎన్.సీ.సీ.డీ రేటును 16% పైకి సవరించాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో తాజాగా జీఎస్టీ పెంచింది!

ఈ స్థాయిలో పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచడాన్ని.. వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు. ఈ సమయంలో పెరగనున్న ధరలు సిగరెట్ సైజుతో పాటు ఫిల్టర్ చేయబడిందా, లేదా అనేదానిపై ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ సుంకం ఇప్పుడు 1,000 సిగరెట్లకు రూ.2,050 నుంచి రూ.8,500 వరకూ ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఇది ఆయా కేటగిరీలను బట్టి ఆధారపడి ఉంటుంది.

65 మి.మీ. వరకూ పొడవున్న ఫిల్టర్ లేని సిగరెట్ల ధర ఒక్కోటీ రూ.2.05 వరకూ.. అదే సైజు ఫిల్టర్ సిగరెట్ ధర రూ.2.10.. 65 - 70 మి.మీ. పొడవుండే మీడియం పొడవు సిగరెట్ ధర ఒక్కో దానికీ సుమారు రూ.3.6 నుంచి రూ.4 వరకూ... 70 - 75 మి.మీ. పొడవుండే ప్రీమియం సిగరెట్ (గోల్డ్ ఫ్లేక్ కింగ్, లైట్ కింగ్, క్లాసిక్, నేవీ కట్ మొదలైనవి!) ధర రూ.5.4 వరకూ పెరగనుంది!

Tags:    

Similar News