అమెరికాలో వైద్యం.. సామాన్యుడికి అందని 'ఖరీదైన' ద్రాక్ష!

అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) కింద లభించిన అదనపు సబ్సిడీలు జనవరి 1తో ముగియడం అమెరికా ఆరోగ్య రంగంలో ఒక నిశ్శబ్ద విస్ఫోటనాన్ని సృష్టించింది.;

Update: 2026-02-01 06:57 GMT

అమెరికా కల అంటే ఒకప్పుడు సుఖమయ జీవనం, ఆర్థిక భద్రత. కానీ నేడు ఆ కల సామాన్యుడికి చేదు నిజంగా మారుతోంది. పెరిగిన అద్దెలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరల కంటే కూడా సగటు అమెరికన్ కుటుంబానికి ఇప్పుడు హెల్త్‌కేర్ బిల్లులే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

సబ్సిడీల తొలగింపు: ఒక ఆర్థిక పిడుగు

అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) కింద లభించిన అదనపు సబ్సిడీలు జనవరి 1తో ముగియడం అమెరికా ఆరోగ్య రంగంలో ఒక నిశ్శబ్ద విస్ఫోటనాన్ని సృష్టించింది. గత కొన్నేళ్లుగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న ఈ ట్యాక్స్ క్రెడిట్లు కనుమరుగు కావడంతో ఇన్సూరెన్స్ ప్రీమియాలు ఒక్కసారిగా భారమయ్యాయి. సర్వేలు చెబుతున్నట్లుగా 73 లక్షల మంది బీమా కవరేజ్ కోల్పోయే ప్రమాదం ఉందంటే అది కేవలం ఒక గణాంకం కాదు.. లక్షలాది మంది ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.

రోగం కంటే ఖర్చే భయంకరమా?

వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి. కానీ అమెరికాలో అది అత్యంత ఖరీదైన 'లగ్జరీ'గా మారుతోంది. ఖర్చుకు భయపడి డాక్టర్‌ను సంప్రదించకపోవడం.. మందులు మానేయడం వంటి చర్యలు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. చిన్నప్పుడే నయం చేయాల్సిన సమస్యను ఆర్థిక భారంతో వాయిదా వేస్తే భవిష్యత్తులో అది ప్రాణాంతక వ్యాధిగా మారి దేశం మీద మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది.

విధానపరమైన మార్పు అత్యవసరం

కేవలం సబ్సిడీలు పెంచడం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం కాదు. ఔషధాల ధరలను నియంత్రించడం, ఇన్సూరెన్స్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించడం.. పారదర్శకమైన వైద్య ఖర్చుల విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. 2026 నాటికి పరిస్థితి మరింత దిగజారుతుందన్న నిపుణుల హెచ్చరికలను గమనిస్తే తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే అమెరికా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.

ఆర్ధిక బలం ఉన్న దేశం కంటే ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్న దేశమే నిజమైన సంపన్న దేశం. తన పౌరులకు కనీస వైద్యం కూడా అందించలేని స్థితిలోకి అమెరికా వెళ్లకుండా ఉండాలంటే హెల్త్‌కేర్‌ను కేవలం ఒక వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

Tags:    

Similar News