తొలిసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కేసీఆర్
తాజాగా విచారణను ఎదుర్కొంటున్న కేసీఆర్.. తన 65 ఏళ్ల వయసును పరిగణలోకి తీసుకొని తాను నివాసం ఉంటున్న ఎర్రవెల్లి ఫార్మర్ హౌస్ (ఒకప్పటి ఫాంహౌస్) కాకుండా నంది నగర్ లో విచారణ చేయటంపై ఆయన కినుకుతో ఉన్నారు.;
ఎదురుదెబ్బలు గులాబీ బాస్ కేసీఆర్ కు కొత్తేం కాదు. ఉద్యమ పార్టీని కాస్తా.. ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేసినట్లుగా పేర్కొన్న ఆయన.. అందుకు తగ్గట్లే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్.. ఇప్పుడు తన మాటకు తగ్గట్లుగా పరిస్థితులు మారేలా చేసుకోలేని పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలంటేనే కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు సైతం తటపటాయించే పరిస్థితి.
అంతటి పవర్ ఫుల్ నేత.. ఈరోజున సిట్ విచారణకు హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. తాను ఉన్న ఎర్రవెల్లిలో కాకుండా హైదరాబాద్ లోని తన నివాసమైన నందినగర్ లో విచారణను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు అత్యంత సన్నిహితులు.. కుటుంబ సభ్యులైన కేటీఆర్ తో పాటు హరీశ్, సంతోష్ లో సైతం విచారణను ఎదుర్కోవటం తెలిసిందే.
తాజాగా విచారణను ఎదుర్కొంటున్న కేసీఆర్.. తన 65 ఏళ్ల వయసును పరిగణలోకి తీసుకొని తాను నివాసం ఉంటున్న ఎర్రవెల్లి ఫార్మర్ హౌస్ (ఒకప్పటి ఫాంహౌస్) కాకుండా నంది నగర్ లో విచారణ చేయటంపై ఆయన కినుకుతో ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోకుండానే సిట్ కు సుదీర్ఘ లేఖ రాశారు. తాను కోరుకున్నట్లు తాను ఉంటున్న ఎర్రవెల్లి ఇంట్లో కాకుండా హైదరాబాద్ కు రమ్మని కోరటాన్ని తప్పు పట్టారు. తన వయసును పరిగణలోకి తీసుకొని.. తాను ఉన్న చోటనే విచారించాలన్న కేసీఆర్.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించటం లేదని పేర్కొన్నారు. ఈ తీరు కోర్టు ధిక్కారం కిందనే వస్తుందన్న కేసీఆర్ తీరు చూస్తే.. ఇలాంటి విషయాల్ని ప్రశ్నించే కన్నా.. వేరే వారి చేత చెప్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
కేసీఆర్ విచారణ అంశంపై తాజాగా కేటీఆర్ సైతం విచారణ చేపట్టే ప్రాంతం గురించి మాట్లాడటం ద్వారా తప్పే చేశారని చెబుతున్నారు.ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్థరాత్రి వేళ రేవంత్ ఇంటిని సోదాలు చేయటం.. బెడ్రూం తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకోవటం మొదలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ గా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ను సైతం తలుపులు బద్ధలు కొట్టి మరీ అదుపులోకి తీసుకొని.. జిల్లాల చుట్టూ తిప్పుకుంటూ చివరకు అరెస్టు చేయటం తెలిసిందే. అప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని కేసీఆర్ సర్కారు పాటించిందా? అక్కడిదాకా ఎందుకు ఒక ప్రముఖ నేతను అదుపులోకి తీసుకునే పద్దతి ఇదేనా? అన్న ప్రశ్నలు అప్పట్లో చర్చకు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
ఇలా తాము చేసిన వాటికి ఎప్పుడూ సమాధానం చెప్పలేని కేసీఆర్ అండ్ కో.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వాదనలు వినిపించటం ప్రజలు హర్షించరన్నచిన్నవిషయాన్ని గులాబీ సైన్యం ఎందుకు మిస్ అవుతున్నట్లు? నిజానికి తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను ఒక మాట అనేందుకు వణికే పరిస్థితి. అందుకు భిన్నంగా ఈ రోజున తాను కోరుకున్నట్లుగా సిట్ విచారణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని దుస్థితి. కాలవైచిత్రి అన్నదానికి ఇంతకు మించిన మంచి ఉదాహరణ ఉండదనే చెప్పాలి.