మొన్న నిర్మల్.. తర్వాత గుంటూరు.. ఇప్పుడు వరంగల్.. టీకా తర్వాత మరణం

Update: 2021-01-25 04:45 GMT
మరోమరణం చోటు చేసుకుంది. మహ్మమారి కోవిడ్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చోటుచేసుకున్న మరణాల జాబితాలో మరొకటి చోటు చేసుకుంది. ఈ మరణాలకు కారణం టీకా వికటించటమేనా? కాదా? అన్నది అధికారికంగా తేలలేదు. కానీ.. అనుమానాలన్ని ఆ దిశగానే సాగుతున్నాయి. కోవిడ్ టీకాల ప్రక్రియ మొదలైన తర్వాత తొలిసారి తెలంగాణలో నిర్మల్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్.. టీకా వేయించుకున్న రోజుల వ్యవధిలో మరణించటంతో వ్యాక్సిన్ వికటించి మరణించారన్న ప్రచారం సాగింది. అయితే.. వ్యాక్సిన్ వికటిస్తే వెంటనే మరణించాలి కానీ.. ఇలా నాలుగు రోజులకు చనిపోవటం ఏమిటన్న ప్రశ్నలకు సమాధానం లభించలేదు.  

ఈ కలకలం కొలిక్కి రాక ముందే..ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక మహిళ టీకా వికటించి మరణించినట్లుగా ప్రచారం మొదలైంది. ఆశ కార్యకర్త టీకా వేయించుకున్న కొద్ది గంటలకే తీవ్ర అనారోగ్యానికి గురి కావటం.. బ్రెయిన్ డెడ్ కావటంతో మరణించారు. ఈ మరణానికి టీకా వికటించటమే కారణమన్నది ఇంకా నిర్దారణ కాలేదు. ఆమెకు టీకా ఇచ్చిన వెయిల్ లోని మందుతో మరో డాక్టర్ కు ఇవ్వగా ఆయన క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో.. టీకా సైడ్ ఎఫెక్టు ఆమె మరణానికి కారణం ఎంతన్నది సందేహంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా వరంగల్ నగరంలోని దీనదయాళ్ నగర్ కు చెందిన 45 ఏళ్ల వనిత అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్ గా పని చేస్తున్నారు. తన తోటి ఉద్యోగులతో కలిసి జనవరి 19న ఆమె న్యూశాయంపేట అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. మూడు రోజులు బాగానే ఉన్న ఆమె.. జనవరి 23న తనకు ఛాతీలో నొప్పి ఉన్నట్లుగా వైద్యులకు సమాచారం అందించారు.

దీంతో ఆమెకు మందులు ఇచ్చి ఇంటికి పంపారు. నొప్పి ఎక్కువైతే.. ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలన్న సలహా ఇచచారు. అయితే.. ఆదివారం ఉదయం వనిత నిద్ర లేవలేదు. ఇంట్లోని వారు లేపే ప్రయత్నం చేయగా.. ఆమె అచేతనంగా ఉన్నారు. ఆమె నిద్రలోనే మరణించినట్లుగా వైద్యులు తేల్చారు. అయితే.. ఆమె మరణానికి కారణం వ్యాక్సిన్ వికటించటమా? మరింకేమైనా అంశమా? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఆమె తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉండేదన్న మాట సిబ్బంది నోట వినిపిస్తోంది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది తేల్లేదు. ఏమైనా.. ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు వస్తున్న మరణాలు.. వ్యాక్సిన్ వేయించుకునే వారిలో కొత్త గుబులును రేపుతున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News