రాజీనామా చేయడం లేదు: సీఎం బొమ్మై

Update: 2021-12-25 16:31 GMT
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తరచూ సీఎంలు మారిపోతున్నారు. ఎవరూ పట్టుమని ఐదేళ్లు ఉండడం లేదు. ఏకు మేకు అవుతారనో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఇప్పుడు సీఎంలు అయితే మారిపోతున్నారు. తాజాగా మొన్ననే పగ్గాలు చేపట్టిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా రాజీనామా చేయబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడ్డాయి.

2018 ఎన్నికల అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది. తాజాగా కర్ణాటకకు చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై రాజీనామా చేయబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. పార్టీలో అగ్ర నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా బొమ్మై సీఎం పీఠం దిగిపోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు కొందరు వ్యక్తులు.. ఈ విషయం కాస్తా బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లగా.. రంగంలోకి దిగిన పార్టీ నేతలు అనిశ్చితిని తొలగించి వివరణ ఇచ్చారు.

కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. కర్ణాటకలో 2023 ఎన్నికల వరకూ సీఎంగా బసవరాజు బొమ్మై కొనసాగుతారని స్పష్టం చేశారు. రాజకీయంగా అలజడి సృష్టించేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఇలాంటి కట్టుకథలు వ్యాపింపచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

-తాను రాజీనామా చేయడం లేదు: బొమ్మై

కర్ణాటక ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారంపై ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని.. తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం లేదని చెప్పారు.

దావోస్ లో జరగబోయే ప్రోగ్రామ్ జూన్ కు వాయిదా పడిందని.. ఇప్పట్లో ఎలాంటి విదేశీ పర్యటన లేదని తెలిపారు. కాగా బీజేపీ అధిష్టానం బొమ్మైను తప్పిస్తుందనే ప్రచారం కొంత కాలంగా జోరుగా జరుగుతోంది.



Tags:    

Similar News