బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన నార్త్ కొరియా...!

Update: 2021-03-25 10:30 GMT
ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. జపాన్ సముద్ర జలాల్లో ఆ మిస్సైళ్ల టెస్ట్ జరిగినట్లు అమెరికాతో పాటు జపాన్ వెల్లడించింది. నిజానికి బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించవద్దన్న ఆంక్షలు ఉత్తర కొరియాపై ఉన్నాయి. కానీ ఆ నిషేధ ఆజ్ఞలను నార్త్ కొరియా ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను నార్త్ కొరియా బేఖాతరు చేసింది. ఉత్తర కొరియా చేపట్టిన మిస్సైల్ పరీక్షలను జపాన్‌, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. క్షిపణలకు చెందిన శిథిలాల తమ జలాల్లో పడలేదని జపాన్ పేర్కొన్నది. ఉత్తర కొరియా అక్రమ రీతిలో బాలిస్టిక్ క్షిపణులను సమీకరిస్తున్నదని, దీని వల్ల సమీప దేశాలకు సమస్యలు తలెత్తుతాయని యూఎస్ పసిఫిక్ కమాండ్ పేర్కొన్నది.

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించడం ఇదే మొదటిసారి. అయితే బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా పరీక్షించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. యూఎన్ భద్రతా మండలి ఆ క్షిపణుల పరీక్షలను నిషేధించింది. వీటిని టెస్ట్ చేయవద్దు అని కిమ్‌, ట్రంప్ మధ్య 2018లో ఓ ఒప్పందం కూడా జరిగింది. అటు ఈ దేశ క్షిపణి పరీక్షలను అమెరికా తేలిగ్గా తీసుకుంది. వీటి వల్ల సుస్థిరతకు ఎలాంటి ప్రమాదం లేదని అధ్యక్షుడు జొబైడెన్ వ్యాఖ్యానించారు. దీన్ని తాము పరిగణన లోకి తీసుకోబోమన్నారు. లోగడ డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఆయన నార్త్ కొరియాతో సఖ్యతకు కాస్త చొరవ తీసుకున్నారు. ఒక సందర్భంలో ఆయన నార్త్ కొరియా అధినేత కిమ్ తో సమావేశమయ్యారు. కానీ ఆ తరువాత కిమ్ మొండి వైఖరి కారణంగా అమెరికా-నార్త్ కొరియా మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి .

ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సంయుక్తంగా మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లు స్పష్టం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సమాయాత్తమౌతున్నామని దక్షిణ కొరియా పేర్కొంది. ఈ విషయంలో అమెరికాతో కలిసి తాము పని చేస్తున్నామని, మిలటరీ అధికారులను అప్రమత్తం చేశామని వెల్లడించింది. ఈ రెండింట్లో ఒకటి.. అత్యాధునికమైన క్షిపణిగా అంచనా వేస్తున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయి, ఏ లక్ష్యాన్ని అవి ఛేదించాయి వాటి ప్రయాణ కాలం ఎంత? అనే విషయంపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ అధికార ప్రతినిధి కేప్టెన్ మైక్ కఫ్కా తెలిపారు. ఈ రెండు క్షిపణుల వల్ల కలిగిన నష్టం ఏ మేరకు ఉందనేది విశ్లేషిస్తున్నామని వివరించారు. క్షిపణులను సంధించడమనేది.. ఉత్తర కొరియా అక్రమంగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు, పొరుగు దేశాల్లో భయోత్పాతాన్ని కలిగించడానికి ఆ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నామని తెలిపారు.
Tags:    

Similar News