ఎమ్మెల్యేల‌కు ఇళ్లు అద్దెకివ్వం!!

Update: 2017-09-05 05:28 GMT
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యే అంటే ఉండే అధికార ద‌ర్పం వేరు. స‌దరు నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌నే రారాజు. కానీ అలాంటి ఎమ్మెల్యేల‌కు కూడా చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఉండేందుకు ఇళ్లు కూడా దొర‌క‌డం లేదంటే న‌మ్ముతారా? న‌మ్మాల్సిందే. ఎందుకంటే నిజంగా నిజం కాబ‌ట్టి!!వాణిజ్య రాజధాని ముంబైలో ఎమ్మెల్యేలకు కిరాయికి ఇళ్లు లభించడం లేదు. ఎమ్మెల్యేల కోసం 175 ఫ్లాట్లు అద్దెకు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదు.

అసలు విషయమేమిటంటే... ముంబైలోని ప్రముఖ నారిమన్ పాయింట్ ప్రాంతంలో 1994లో శరద్‌ పవార్ ప్రభుత్వం రెండు టవర్లు - 1995లో మనోహర్ జోషి ప్రభుత్వం మరో రెండు టవర్లను ఎమ్మెల్యేల కోసం నిర్మించాయి. దీంతో నాలుగు టవర్లలో 336 ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.

ఎమ్మెల్యే సతీశ్‌ పాటిల్‌ కు కేటాయించిన ఫ్లాట్‌ లో ఆగస్టు మొదటివారంలో సీలింగ్ ఊడి కిందపడిపోయింది. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవన సముదాయాలను కూల్చివేసి వీటి స్థానంలో కొత్త టవర్లు నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా తమ ఫ్లాట్లను ఖాళీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అనంత్ కల్సే నోటీసులు జారీచేశారు. నారిమన్ పాయింట్ నుంచి దాదార్ ప్రాంతం వరకు 450-500 గజాల విస్తీర్ణంతో కూడిన ఒక పడక - రెండు పడకల గదుల ఇళ్లు కావాలని ప్రకటనలు ఇచ్చినా సానుకూల స్పందన రాలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఫ్లాట్లు కిరాయికి ఇచ్చేందుకు భవనాల యజమానులు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఎందుకు ఎమ్మెల్యేల‌కు ఇండ్లు కిరాయికి ఇచ్చేందుకు, అది కూడా ప్ర‌భుత్వం ద్వారా చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌నే ప్ర‌శ్న‌కు...స‌మాధానం మ‌నం అంద‌రం ఊహించుకోవ‌చ్చు.
Tags:    

Similar News