కార్లు.. చిన్న వాహనాల ఓనర్లకు పండగే..

Update: 2016-07-30 15:35 GMT
నిజమే.. కాకుంటే అందరికి కాదు. కొందరికి మాత్రమే. ఎన్నికలు దగ్గర పడుతుంటే చాలు.. కొత్త కొత్త పథకాలు.. నోరూరించే ఆఫర్లు రాజకీయ పార్టీలు ప్రకటిస్తుంటాయి. అయితే.. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న పార్టీలకు మరింత సౌలభ్యం ఏమిటంటే.. ఎన్నికలకు కాస్త ముందుగానే ప్రజాభిమానం పొందేలా కొన్ని స్పెషల్ పథకాల్ని ప్రకటించే వీలు ఉండటం. తాజాగా అలాంటి పనినే చేసింది గుజరాత్ ప్రభుత్వం.

మరికొద్ది నెలల్లో వస్తున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న ఆనందీ బెన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఆగస్టు 15 నుంచి కార్లు.. చిన్న వాహనాలకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజా ఆఫర్ తో మధ్యతరగతికి చెందిన సోదరీ సోదరీమణులు ఇక నుంచి కార్లను.. చిన్న వాహనాల్ని సులువుగా బయటకు తీయొచ్చని.. వారికి టోల్ వాత పడదని చెప్పుకొచ్చారు.

వాల్సడ్ జిల్లాలో 67వ వాన్ మహోత్సవ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్.. కార్లు.. చిన్న వాహనాలకు టోల్ టాక్స్ పన్ను పరిధి నుంచి తప్పిస్తామని.. ఇది మధ్యతరగతి వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఆ టోల్ టాక్స్ కేవలం రాష్ట్ర సర్కారు నేతృత్వంలో నడిచే వాటికి మాత్రమే వర్తిస్తుందని.. నేషనల్ హైవేల మీద ఉండే టోల్ ప్లాజాలకు ఈ రూల్ వర్తించదని తేల్చారు. దీని వల్ల ఉపశమనం ఎంత మేర అంటే.. కాస్త తక్కువనే చెప్పాలి. ఎన్నికలు ముంగిట్లో వచ్చేస్తున్న వేళ.. మధ్యతరగతి జీవుల మనసు దోచుకునేందుకు వీలుగా ప్రకటించిన ఈ ఆఫర్ గుజరాతీల మనసును ఎంతమేర దోచుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News