గంట‌ల కొద్ది సుత్తికి చెక్.. సూటిగా స‌మావేశాలు!

Update: 2019-06-01 08:35 GMT
ఏం చేయాల‌న్న అంశంపై క్లారిటీ ఉండ‌టం.. ఎలా చేయాల‌న్న విజ‌న్ తో పాటు..టైం వేస్ట్ కాకూడ‌ద‌న్న ఆలోచ‌న క‌ల‌గ‌లిస్తే ఎలా ఉంటుంద‌న్న విష‌యం జ‌గ‌న్ సీఎం అయిన రెండో రోజునే  ఏపీ ఉన్న‌తాధికారుల‌కు కాస్తంత క్లారిటీ వ‌చ్చేసింది. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. తాజా సీఎం జ‌గ‌న్ కు ప‌ని చేయించే విష‌యంలో అస్స‌లు పోలికే లేద‌న్న మాట వ‌చ్చేసింది.

ఒక విష‌యం మీద గంట‌ల కొద్దీ మీటింగ్ నిర్వ‌హించ‌టం.. నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో అవ‌స‌రానికి మించిన జాగు కార‌ణంగా.. స‌మీక్షా స‌మావేశాల‌న్ని గంట‌ల కొద్దీ స‌మ‌యం వృధా అయ్యేది. దీనికి భిన్నంగా జ‌గ‌న్‌.. తాను స‌మీక్ష చేయ‌బోయే శాఖ మీద అవ‌గాహ‌న‌తో పాటు.. తానేం చేయాల‌న్న క్లారిటీ ఉండ‌టం.. జాగు లేకుండా విష‌యాల్ని సూటిగా ప్ర‌స్తావించి.. అధికారుల‌కు టాస్క్ లు ఇచ్చే తీరు ఇప్పుడు స‌రికొత్త‌గా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాతి రోజున జ‌గ‌న్ వైఖ‌రిని చూస్తే.. ఆయ‌న నిర్వ‌హించిన ప్ర‌తి స‌మావేశంలోనూ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టంతో పాటు.. తానేం కోరుకుంటున్న విష‌యాన్ని ఆయ‌న చెప్పేస్తున్నారు. ఎలా చేయాల‌న్న దాని కంటే ఇలా చేయండ‌న్న ఆదేశాల్ని జారీ చేస్తున్నారు. అదే ప‌నిగా మాట్లాడుతూ.. సుత్తి కొట్టేస్తున్నాడ్రా బాబు అన్న భావ‌న క‌ల‌గ‌కుండా ఉంటున్న జ‌గ‌న్ తీరు అధికారుల‌కు కొత్త అనుభ‌వంగా మారిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.

అంతేకాదు.. ఏ మాత్రం అవ‌కాశం ల‌భించినా.. పాద‌యాత్ర సంద‌ర్భంగా త‌న దృష్టికి వ‌చ్చిన సమ‌స్య‌ల‌పై తానిచ్చిన హామీల్ని అమ‌లు చేసేందుకు వెనుకాడ‌లేదు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 44 వేల స్కూళ్ల‌కు సంబంధించి మ‌ధ్యాహ్న భోజ‌న పథ‌కంలో ప‌ని చేసే కార్మికుల వేత‌నాల పెంపుపై నిర్ణ‌యం తీసుకున్నారే కానీ.. దాని గురించి గొప్ప‌గా చెప్పుకోక‌పోవ‌టం.. ప్ర‌చారానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.  

అధికారుల‌ను.. ఇష్యూల‌ను డీల్ చేసే విష‌యంలో చంద్ర‌బాబుకు.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేద‌న్న విష‌యం తొలి రోజునే స్ప‌ష్టం చేసిన సీఎం జ‌గ‌న్‌.. రెండో రోజున ఆ విష‌యంలో త‌న‌దైన ముద్ర‌ను అధికారుల మీద వేశారు. జ‌గ‌న్ తో ప‌ని చేస్తున్న అనుభ‌వం కొత్త‌గా ఉంద‌ని.. పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టించే కొత్త త‌ర‌హా టెక్నిక్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర చాలా ఉన్న‌ట్లుగా తాము అర్థం చేసుకున్న‌ట్లుగా ఉన్న‌తాధికారులు వ్యాఖ్యానించ‌టం విశేషం.
Tags:    

Similar News