హైద‌రాబాద్ పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ రూల్

Update: 2018-07-18 06:29 GMT
ఆ మ‌ధ్య‌న పేప‌ర్లో ఒక వార్త ప్ర‌ముఖంగా వ‌చ్చింది. ఆ మ‌ధ్య‌న ఒక‌ రాష్ట్రంలో బైక్ కు పెట్రోల్ కొట్టాలంటే.. వాహ‌న‌దారుడు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేన‌న్న రూల్‌ను అమ‌లు చేశారు. రోడ్డు ప్ర‌మాదాల్లో ఎక్కువ‌గా టూవీల‌ర్ మీద ప్ర‌యాణించే వారు గాయాల పాలు కావ‌టం.. మ‌ర‌ణించ‌టం జ‌రుగుతుంటుంది.

ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రూల్‌ను అమ‌లు చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. కొన్ని విష‌యాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని తెలుగు చంద్రుళ్లు ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకుంటేనే పెట్రోల్ పోయాల‌న్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ‌దిలేసి.. హైద‌రాబాద్‌కు చెందిన కొన్ని పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్‌ను షురూ చేశారు. ఈ పెట్రోల్ బంకుల్లో టూవీల‌ర్ మీద పెట్రోల్ పోయించుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ పెట్టుకొని ఉండాల్సిందే. లేకుండా వీరికి పెట్రోల్ పోయ‌రు. ఇంత‌కీ ఈ కొత్త రూల్ ను ఎవ‌రు తెర మీద‌కు తెచ్చారంటే.. హైద‌రాబాద్ లో జైళ్ల శాఖ నిర్వ‌హించే పెట్రోల్ బంకుల్లో దీన్ని అమ‌లు చేస్తున్నారు.

రోడ్డు ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారిలో 90 శాతం మంది హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌టం వ‌ల్ల‌నేన‌న్న విష‌యం ప‌లు అధ్య‌య‌నాల్లో వెలువ‌డుతున్న నేప‌థ్యంలో తాము నిర్వ‌హించే 13 పెట్రోల్ బంకుల్లో ఈ రోజు (బుధ‌వారం) నుంచి హెల్మెట్ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. సో.. హైద‌రాబాద్ వాసులు హెల్మెట్ పెట్టుకునే విష‌యంలో అప్డేట్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే.. బండిలో పెట్రోల్ పోసేందుకు కొన్ని పెట్రోల్ బంకులు నో చెబుతాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News