న‌ర‌సింహ‌న్ ఒక్క‌డికే గ‌వ‌ర్న‌ర్ రికార్డ్

Update: 2017-09-30 16:15 GMT
తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్‌ నరసింహన్ ఖాతాలో ప్ర‌త్యేక రికార్డ్ న‌మోదు అయింది. 2010 జనవరిలో నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టి నాటి నుంచీ ఆయనే కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం గవర్నర్‌ గా ఉన్న నరసింహన్‌ కు తాజాగా మ‌రో తీపిక‌బురు ద‌క్కింది. రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రెండు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్న ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ను కొన‌సాగించారు. త‌ద్వారా గ‌త కొద్దికాలంగా సాగుతున్న చ‌ర్చ‌కు ఫుల్‌ స్టాప్ ప‌డింది.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. నరసింహన్ పదవీ కాలం మే మూడో తేదీతో ముగిసింది. దీంతో ఆయ‌న‌కు పొడిగింపు ఇస్తారా లేక ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తారా? అనే విషయమై రాజకీయవర్గాల్లో చర్చ సాగింది. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ప్ర‌చారం సాగింది. తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు చెందిన శంకరమూర్తి - ఆంధ్రప్రదేశ్‌ కు గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ ను నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల పాలన వేర్వేరు రాజధానుల నుంచి జరుగుతున్నందున ఇద్దరు గవర్నర్లు అవసరమని కేంద్రం భావిస్తోంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే త‌దుప‌రి ఆదేశాల వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్‌ గా న‌ర‌సింహ‌న్ కొన‌సాగనున్నార‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ‌ ఆదేశాలు విడుద‌ల చేసింది. దీంతో కొత్త గ‌వ‌ర్న‌ర్ల ఎంపిక‌ స‌మ‌యంలో న‌ర‌సింహ‌న్‌ ను సైతం మార్చుతార‌ని ప్ర‌చారం సాగింది.

ఐదు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్ల ఎంపిక స‌మ‌యంలో తమిళనాడు గవర్నర్‌ గా బనర్విలాల్ పురోహిత్ - మేఘాలయ గవర్నర్‌ గా గంగాప్రసాద్ - అరుణాచల్‌ ప్రదేశ్ గవర్నర్‌ గా బి.డి. మిశ్రా - బీహార్ గవర్నర్‌ గా సత్యపాల్ మాలిక్ నియామకం అయ్యారు. అండమాన్ - నికోబార్ దీవులు లెఫ్టినెంట్ గవర్నర్‌ గా దేవేంద్ర కుమార్ జోషిని నియమించారు. ప్రొఫెసర్ జగదీష్ ముఖి స్థానంలో దేవేంద్ర కుమార్ జోషి నియామకం అయ్యారు. జగదీష్ ముఖిని అసోం గవర్నర్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కొత్త గ‌వ‌ర్న‌ర్ పేరు లేదు. దీంతో సుదీర్ఘ కాలం ఉన్న గ‌వ‌ర్న‌ర్‌ గా న‌ర‌సింహ‌న్ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు. త‌ద్వారా కాంగ్రెస్ సార‌థ్యంలోని యూపీఏ హ‌యాంలో నియామ‌క‌మై, బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ హ‌యాంలో కొన‌సాగుతున్న గ‌వ‌ర్న‌ర్‌ గా ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు. విభజన సమయంలో చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరగకుండా సమర్థంగా వ్యవహరించారనే అభిప్రాయముంది. 2014 తెలంగాణ ఏర్పడిన సమయంలో ఆ రాష్ట్రానికీ ఆయన్నే గవర్నర్‌ గా ఉంచారు.
Tags:    

Similar News