ఆ బంధం వద్దంటే భర్తను చంపేసింది.. సూసైడ్ అని చెప్పి దొరికేసింది
క్షణిక ఆనందాల కోసం.. వివాహేతర సంబంధాల కోసం కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసుకునే దుర్మార్గాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి.;
క్షణిక ఆనందాల కోసం.. వివాహేతర సంబంధాల కోసం కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసుకునే దుర్మార్గాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రియుడి కోసం భర్తల్ని దారుణంగా హతమార్చే ఉదంతాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. సహజ మరణంగా చిత్రీకరించిన వైనం వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న ఈ సంచలన ఉదంతంలోకి వెళితే..
బెంగళూరుకు చెందిన 45 ఏళ్ల అశోక్, 36 ఏళ్ల పూర్ణిమలకు 2011లో పెళ్లైంది. వీరికి పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. బోడుప్పల్ లోని ఈస్ట్ బ్రందావన్ కాలనీలో ఉంటున్నారు. ఒక ఇంజినీరింగ్ కాలేజీలో లాజిస్టిక్స్ మేనేజర్ గా అశోక్ పని చేస్తున్నారు. పూర్ణిమ ఇంటి వద్దే ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. వీరికి ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలీ మహేశ్ (22)తో పరిచయమై.. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.
ఈ విషయం తెలిసిన అశోక్ భార్యను మందలించాడు. తన ఇంటిని కూడా మార్చాడు. అయినప్పటికి పూర్ణిమ తీరులో మార్పు రాలేదు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో భార్యభర్తల మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో భర్తను హత్య చేయాలని పూర్ణిమ డిసైడ్ అయ్యింది. ఇందుకు మహేశ్ సాయాన్ని కోరింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాయికుమార్ సాయాన్ని మహేశ్ అడిగాడు.
వీరంతా కలిసి ఈ నెల 11న అశోక్ కాలేజీ నుంచి వచ్చినంతనే అతన్ని కొట్టి కిందపడేశారు. పూర్ణిమ, సాయి గట్టిగా పట్టుకోగా.. మహేశ్ మూడు చున్నీలను మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయాడని నిర్దారించుకొన్న తర్వాత మహేశ్.. సాయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసు కేసు లేకుండా చేసుకోవటానికి పూర్ణిమ కొత్త నాటకానికి తెర తీసింది.
తన భర్త సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి రాగానే రెస్టు తీసుకుంటానని బెడ్రూంలోకి వెళ్లాడని.. తాను ప్లే స్కూల్ పనులు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటల సమయానికి వచ్చేసరికి బాత్రూంలో స్ప్రహ తప్పి పడిపోయిన విషయాన్ని గుర్తించినట్లుగా పోలీసులకు చెప్పింది. దీంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అశోక్ చనిపోయాడని చెప్పారని.. గుండెపోటుతో మరణించినట్లుగా ఆమె పోలీసులకు చెప్పింది.
తన భర్త మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని కట్టుకథ చెప్పింది. బంధువులతోనూ ఇదే చెప్పింది. అయితే.. అశోక్ ఒంటి మీద గాయాలు ఉండటంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్ణిమ ప్రవర్తనపై అనుమానంతో వారి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించారు. అశోక్ చనిపోయిన రోజున వారి ఇంట్లోకి మహేశ్.. సాయి కుమార్ లు వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. ముగ్గురు నిందితుల్ని రిమాండ్ తరలించారు. వివాహేతర సంబంధం మోజులో భర్తను అంతం చేయటం ఒకటైతే.. తాను చేసే పని కారణంగా తన కొడుకు భవిష్యత్తు ఏమవుతుందన్న విషయాన్ని గుర్తించని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.