ఏ అవకాశాన్ని ఏ మాత్రం వదిలిపెట్టని నిర్భయ దోషులు

Update: 2020-01-30 12:16 GMT
చేసిన దారుణానికి కుమిలిపోవటం మానేసి.. తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఉండటం కోసం న్యాయశాస్త్రంలోని అవకాశాల్ని ఒక్కొక్కటిగా వాడేస్తున్న వైనం చూసినప్పుడు.. దారుణమైన నేరాలకు పాల్పడిన దోషికి ఇన్ని అవకాశాలు ఉంటాయా? అన్న భావన కలిగే పరిస్థితి. మొన్నటివరకూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ కు తనకున్న అన్ని అవకాశాల్ని వాడేయటం..అతగాడికి ఉరి అమలు మినహా మరే మార్గం లేని పరిస్థితి. ఇలాంటివేళ.. తనకున్న అవకాశాన్ని వినియోగించుకుంటూ శిక్ష అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మరో ఇద్దరు దోషులు వినయ్ శర్మ.. అక్షయ్ కుమార్ లు.

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సిన వేళ.. దానిపై స్టే విధించాల్సిందిగా కోరుతూ అక్షయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ ను దాఖలు చేశాడు అందులో చిత్రమైన వాదనను వినిపించాడు. మహిళల హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడితో కోర్టులు మరణశిక్షలు విధిస్తాయని అక్షయ్ పేర్కొన్నాడు. తాను చేసిన దారుణ నేరాన్ని.. తన చావుతెలివితో కోర్టుకు ముందరకాళ్ల బంధాలు వేయాలన్నట్లుగా వ్యవహరించారు. అయితే.. అతడి పిటిషన్ ను సీనియర్ న్యాయవాది జస్టిస్ ఎన్వీ రమణ.. ఆర్ భానుమతి.. జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడి ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్ లో విచారణ జరిపి.. దాన్ని విచారించేందుకు నో చెప్పింది.

ఇదిలా ఉంటే.. నిర్భయ దోషుల్లో మరొకరు వినయ్ శర్మరాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను పెట్టుకున్నాడు. దీనిపై నిర్ణయం పెండింగ్ లో ఉంది. ఒకవేళ.. రాష్ట్రపతి క్షమాభిక్షకు నో చెప్పిన పక్షంలో.. మళ్లీ దానిపై సుప్రీంను ఆశ్రయించే వీలుంది. మొత్తంగా చూసినప్పుడు నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న మరణశిక్షను అమలు చేయటానికి వీల్లేని విధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News