జగన్ కొత్త జిల్లాలకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ..లేఖ కలకలం

Update: 2020-11-17 04:45 GMT
ఏపీ ఎన్నికల కమిషనర్ సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకోవాలని తాజాగా లేఖ రాయడం కలకలం రేపింది. ఏపీ సీఎం జగన్ వచ్చే కొత్తసంవత్సరం జనవరిలో కొత్త జిల్లాలు ఏర్పాటు దిశగా వడివడిగా ముందుకు పోతుంటే ఆయనతో కొద్దిరోజులుగా తలపడుతున్న  ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా ఓ లేఖ రాసి సంచలనం సృష్టించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ  మధ్యలో ఉందని.. అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.

సీఎం జగన్ సోమవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రోజే నిమ్మగడ్డ ఈ లేఖ రాయడం కలకలం రేపింది. ఈ సన్నాహాలపై నిమ్మగడ్డ లేఖలో అభ్యతరం తెలిపారు.

‘13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఎన్నికలు పూర్తయ్యేదాకా 13 జిల్లాలే ఉండాలి. లేనిపక్షంలో జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దు’’ అని ఆయన తన లేఖలో సీఎస్ ను కోరినట్లు తెలిసింది.

దీంతో జిల్లాల విభజనకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ మరో అస్త్రం సంధించినట్టైంది. దీనిపై జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News