ఇంటి కప్పుపై పడే ప్రతి వర్షపు చుక్క పవర్ ప్లాంట్‌లా?

పునరుత్పాదక ఇంధన రంగంలో జల, సౌర, పవన విద్యుత్ వంటి సాంప్రదాయ పద్ధతులు మనకు సుపరిచితమే. అయితే వీటి పరిమితులను అధిగమిస్తూ చైనా శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.;

Update: 2026-04-24 02:45 GMT

పునరుత్పాదక ఇంధన రంగంలో జల, సౌర, పవన విద్యుత్ వంటి సాంప్రదాయ పద్ధతులు మనకు సుపరిచితమే. అయితే వీటి పరిమితులను అధిగమిస్తూ చైనా శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా సౌర ఫలకాలు పనిచేయడానికి సూర్యరశ్మి తప్పనిసరి. ఆకాశం మేఘావృతమైనా లేదా వర్షం పడుతున్నా వాటి పనితీరు మందగిస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దుతూ.. పడే వర్షపు చినుకుల ద్వారానే విద్యుత్తును ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతికతను వారు అభివృద్ధి చేశారు. వర్షపు చుక్కలు ప్యానెల్‌పై పడినప్పుడు కలిగే ఒత్తిడిని నేరుగా విద్యుత్ శక్తిగా మార్చడమే ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న ప్రధాన సూత్రం.

ఈ ప్రయోగంలో భాగంగా రూపొందించిన ఒక చిన్న ప్యానెల్... కేవలం వర్షపు నీటి శక్తితో ఏకకాలంలో 50 ఎల్‌ఈడీ లైట్లను వెలిగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని కోసం శాస్త్రవేత్తలు `ట్రైబో ఎలక్ట్రిక్ నానోజెనరేటర్` (TENG) అనే పరికరాన్ని వినియోగించారు. ద్రవ- ఘన పదార్థాల మధ్య జరిగే ఘర్షణ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగినా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం చాలా స్వల్పంగా ఉండేది. కానీ చైనా పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త డిజైన్ ఈ ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి.. వాణిజ్యపరమైన ఆవిష్క‌ర‌ణ‌ల‌కు మార్గం సుగమం చేసింది.

ఈ సరికొత్త ప్యానెల్ నిర్మాణంలో `బ్రిడ్జ్ నెట్‌వర్క్ జనరేటర్స్` అనే అధునాతన పద్ధతిని అనుసరించారు. వర్షపు చినుకులు ప్యానెల్‌పై పడినప్పుడు వెలువడే శక్తి ఏమాత్రం వృథా కాకుండా ఒకచోట చేర్చి.. దానిని నిరంతర విద్యుత్ ప్రవాహంగా మార్చడంలో ఈ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు లేదా ఆకాశం పూర్తిగా మేఘావృతమైన పరిస్థితుల్లో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్తును పొందవచ్చు. సోలార్ ప్యానెల్స్‌కు ఇవి సరైన ప్రత్యామ్నాయంగా లేదా అనుబంధంగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతానికి ఈ సాంకేతికత ప్రయోగశాల స్థాయిలోనే ఉన్నా.. భవిష్యత్తులో దీనిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెస్తే ఇంధన రంగంలో పెను మార్పులు రావడం ఖాయం. ముఖ్యంగా అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో .. తీర ప్రాంతాల్లో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ సోలార్ ప్యానెల్స్‌పై ఒక పొరలా దీనిని అమర్చడం ద్వారా `హైబ్రిడ్` పద్ధతిలో విద్యుత్ పొందవచ్చు. అంటే ఎండ ఉన్నప్పుడు సౌరశక్తిని, వర్షం పడినప్పుడు వర్షపు శక్తిని గ్రహించి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా పొందే అవకాశం ఉంటుంది.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధంగా లభించే ప్రతి వనరును శక్తిగా మార్చుకోవాలనే లక్ష్యంలో ఈ ఆవిష్కరణ ఒక మైలురాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా.. విపత్తు సమయాల్లో లేదా గ్రిడ్ విద్యుత్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ఈ `రెయిన్ ప్యానెల్స్` వెలుగులు నింపుతాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరంతర పరిశోధనలు జరిగితే.. భవిష్యత్తులో మన ఇంటి కప్పులపై పడే ప్రతి వర్షపు చుక్క ఒక చిన్న పవర్ ప్లాంట్‌లా మారి గృహ అవసరాలకు అవసరమైన శక్తిని అందించే రోజు ఎంతో దూరంలో లేదు.

Tags:    

Similar News